మోడీ సర్కార్ పై రాజన్ బాంబు

September 04, 2017


img

నోట్ల రద్దు వలన ప్రభుత్వానికి, ప్రజలకు, రిజర్వ్ బ్యాంకుకు, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఎదురైన సమస్యలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేటికీ ఆ దెబ్బకు అనేక రంగాలు కోలుకోలేకపోతున్నాయి. అయితే నేటికీ ఆ కష్టాలు కొనసాగుతున్నప్పటికీ అందరూ దాని గురించి మరిచిపోతున్న సమయంలో మళ్ళీ దానిపై చర్చలు, వాదోపవాదాలు, విమర్శలు మొదలవడం విశేషం. నోట్లరద్దు వలన నల్లధనం వెలికిరాలేదన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన చిన్న వ్యాఖ్యతో ఆ దుమారం మొదలైంది. 

మాజీ ఆర్.బి.ఐ.గవర్నర్ రఘురామ రాజన్ రచించిన “ఐ డూ వాట్ ఐ డూ: ఆన్ రిఫార్మ్స్ రెటోరిక్ అండ్ రిసాల్వ్” అనే పుస్తకంలో నోట్ల రద్దు గురించి వ్రాసిన కొన్ని విషయాలు ఇంకా సంచలనం సృష్టిస్తున్నాయి. 

వాటి గురించి క్లుప్తంగా చెప్పుకొంటే, ఆయన హయంలోనే నోట్లరద్దు గురించి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయం కోరింది. దాని వలన దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణ సమస్యలను ఎదుర్కోవడం కష్టమని కనుక తాను కొన్ని మంచి ప్రత్యామ్నాయాలను సూచించినట్లు రాజన్ చెప్పారు. కానీ ప్రభుత్వం నోట్లరద్దుకే మొగ్గు చూపుతూ దాని కోసం ఒక కమిటీని వేసింది. దానిలో తాను పాల్గొనలేదని, ఆర్.బి.ఐ. తరపున డిప్యూటీ గవర్నర్ పాల్గొన్నారని రాజన్ తెలిపారు. నోట్ల రద్దు వలన ఏమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా? అనేది భవిష్యత్ లో తెలుస్తుందని రాజన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

నవంబర్ 8న పాతపెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించే రెండు మూడు గంటల ముందు వరకు ఆ విషయం ఎవరికీ తెలియదని అనేకసార్లు కేంద్రమంత్రులే చెప్పుకొన్నారు. అటువంటి వ్యవహారాలలో గోప్యత పాటించకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదని సమర్ధించుకొన్నారు. కానీ దాని కోసం దాదాపు ఏడాది ముందుగానే కమిటీలు ఏర్పాటయ్యాయని ఆ సమావేశాలలో ఆర్.బి.ఐ. డిప్యూటీ గవర్నర్ కూడా పాల్గొన్నారని రాజన్ చెప్పడం విశేషం. ఇక నోట్ల రద్దు వలన తలెత్తే సమస్యల గురించి హెచ్చరించినా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా ముందుకు వెళ్ళినట్లు స్పష్టం అవుతోంది. అందుకే ప్రతిపక్షాలు నోట్ల రద్దును అంత గట్టిగా వ్యతిరేకించాయని భావించవలసి ఉంటుంది. 


Related Post