తెలంగాణా వచ్చినా మార్పురాలేదా?

September 04, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అన్ని కష్టాలు తీరిపోతాయని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలందరూ కలలు కన్నారు. ఆ నమ్మకంతోనే తెరాసకు ఎటువంటి పాలనానుభావం లేకపోయిన అధికారం కట్టబెట్టారు. ప్రజలు తమపై ఉంచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపట్టి ఒకటొకటిగా అన్నిటినీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కానీ కొందరు అధికారులు, దిగువ స్థాయి పార్టీ నేతలు అవినీతి కారణంగా తెరాస సర్కార్ కు చెడ్డపేరు వస్తోంది. నేరెళ్ళ ఘటన అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

తాజాగా నిన్న ఇద్దరు దళిత యువకులు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం దళితులకు 3 ఎకరాల భూపంపిణీ పధకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే సంగతి బయటపడింది.  

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మాంకాలి శ్రీనివాస్ (28), యాలాల పరుశురాములు (30) అనే ఇద్దరు దళిత యువకులు ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. 

వారిరువురూ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే, బెజ్జంకిలో దళితులకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సుమారు 60 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. అయితే అసలు భూమిలేని అర్హులైన దళితులకు ఆ భూమిని పంచిపెట్టవలసి ఉండగా వారికి కొద్దిగా ఇచ్చి మిగిలిన భూములను స్థానిక తెరాస నాయకులు తమ అనుచరులకు కట్టబెట్టడానికి సిద్దపడ్డారని గ్రామస్తులు చెపుతున్నారు. అలాగ ఇప్పుడు భూమి పొందుతున్నవారిలో కొంతమందికి ఇప్పటికే వేరేగా భూములు ఉన్నాయని వారు చెపుతున్నారు. అర్హులైన దళితులు ఒక్కొకరి నుంచి రూ.20,000 నుంచి లక్ష వరకు లంచాలు డిమాండ్ చేస్తునట్లు గ్రామస్తులు చెపుతున్నారు. లంచాన్ని బట్టి ఒక్కొకరికీ 3 ఎకరాలకు బదులు ఎకరం లేదా రెండెకరాలు చొప్పున కేటాయిస్తున్నారని చెప్పారు. 

ఆత్మహత్య ప్రయత్నం చేసుకొన్న మహంకాళికి రెండెకరాలు కేటాయించినట్లు చెప్పినప్పటికీ ఇంతవరకు అతనికి ఆ భూమిని అప్పగించలేదు. ఇక పరశురాములుకు అసలు భూమి కేటాయించలేదు. అధికారులు, తెరాస ప్రజాప్రతినిధులు చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేకపోవడంతో నిన్న వారివురూ ఆత్మహత్యాయత్నం చేసుకొన్నారు. వారివురి పరిస్థితి చాలా విషమంగా ఉందిప్పుడు. వారిలో శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.  

ఈ సంగతి తెలుసుకొని మంత్రి ఈటెల రాజేందర్, తెరాస ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపి వినోద్ కుమార్ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని భాదితులను పరామర్శించారు. 

ఇదివరకు ఆంధ్రా పాలకులు..వారికి తొత్తుల్లాగ వ్యవహరించే నేతలున్నప్పుడు ఇటువంటి, అక్రమాలు, అవినీతి, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడుతుండేవి. కానీ తెలంగాణా ఏర్పడి దాని కోసం పోరాడిన తెరాసయే అధికారంలో ఉన్నప్పటికీ దిగువస్థాయి నేతలు, అధికారుల ప్రవర్తన, ఆలోచనాధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. అటువంటి వారి వలన..వారి అవినీతి, నిర్లక్ష్యం వలన తెరాస సర్కార్ ఎన్ని మంచి పనులు చేస్తున్నా అప్రదిష్ట కలుగుతోంది. రాష్ట్రాభివృద్ధి సజావుగా జరగాలంటే ముందుగా దిగువస్థాయి నుంచి పైస్థాయి వరకు ఇటువంటి వాటిని కట్టడిచేయడం చాలా అవసరం లేకుంటే తెరాస సర్కార్ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. 


Related Post