వాళ్ళు సైంధవులు: జూపల్లి

September 04, 2017


img

నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఎంజికెఎల్ఐ అక్విడక్ట్ వద్ద ఆదివారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యసయాభివృద్ధి, రైతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వాటికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైంధవుల్లాగ అడ్డుపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ముందుకే సాగిపోతున్నారని చెప్పారు. 

తరువాత మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తమ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి వివరించిన తరువాత కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తమ ప్రభుత్వం గురించి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయనకు ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాలం చెల్లిన పార్టీ అని మంత్రి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనతో సహా ఈ సదస్సులో పాల్గొన్నవారందరూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారని ఆక్షేపించారు. 

ఈ సదస్సు ముఖ్యోద్దేశ్యం రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, అవి పనిచేసే విధానం గురించి రైతులకు అవగాహన కల్పించడం. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పుకోవడం తప్పేమీ కాదు. కానీ రైతులకు అవగాహన కల్పించే బదులు కాంగ్రెస్ నేతలపై విమర్శలకు పరిమితమయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనుక అది ఏదోవిధంగా ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వంపై విమర్శలు, పోరాటాలు చేయడం సహజమే. కనుక దానిని రాజకీయంగా ఎదుర్కోవడం చాలా అవసరమే కానీ అందుకు ఇటువంటి వేదికలు సరైనవి కావని చెప్పక తప్పదు. 

ఉదాహరణకు ఏపిలో జగన్మోహన్ రెడ్డి నంద్యాల, కాకినాడ ఎన్నికల ప్రచారంలో పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అనుచితంగా మాట్లాడినందున ఆ రెండు ఎన్నికలలో కూడా వైకాపాను ప్రజలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రతిపక్ష నేతలు అనుచితమైన విమర్శలు, ఆరోపణలు చేస్తే వారికి ప్రజలే వచ్చే ఎన్నికలలో తగిన విధంగా బుద్ధి చెపుతారు. కానీ ప్రతిపక్షాలను నిలువరించే ప్రయత్నంలో తెరాస నేతలు మితిమీరి ప్రతివిమర్శలు చేస్తుంటే తాము కూడా ప్రజల దృష్టిలో చులకనయిపోయే ఉందని గ్రహిస్తే వారికే మంచిది.  



Related Post