ప్రశాంత్ కిషోర్ ముందే పసిగట్టాడా?

September 02, 2017


img

జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివే కనుక ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవడానికి అప్పుడే అతనిని ఏపికి రప్పించి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. బహుశః ఆయన సూచన మేరకే జగన్ నవరత్నాలు (తొమ్మిది హామీలు), పాదయాత్ర ప్రకటనలు చేసి ఉండవచ్చు. 

అతను  నంద్యాల ఉపఎన్నికలలో, కాకినాడ మున్సిపల్ ఎన్నికలలో జగన్ కు సహాయపడుతారని, వైకాపాకు ఎన్నికల వ్యూహరచన చేస్తాడని అందరూ భావించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఈ రెండు ఎన్నికలను ప్రశాంత్ కిషోర్ కనీసం అధ్యయనం చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఆ ఎన్నికలు మొదలవక మునుపే ప్రశాంత్ కిషోర్ హడావుడిగా గుజరాత్ వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ రెండు ఎన్నికల ప్రచారంలో ‘చంద్రబాబును రోడ్డుపై ఉరి తీయాలి...నడిరోడ్డుపై కాల్చి చంపాలి’ అంటూ జగన్ రెచ్చిపోవడం, బహుశః ఆకారణంగా వైకాపా ఓడిపోవడం జరిగింది. 

జగన్ ఒక పరిణతి చెందిన రాజకీయ నేతగా కాకుండా, ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో, దుందుడుకుగా  వ్యవహరిస్తుండటం ప్రశాంత్ కిషోర్ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే పార్టీ సిద్దాంతంగా మార్చుకొని కేవలం తనకున్న పాపులారిటీతో పార్టీని గెలిపించుకోగలనని జగన్ అహంభావంతో వ్యవహరిస్తుంటారని, ఆ అతి విశ్వాసం, అహంభావమే 2014 ఎన్నికలలో తమ కొంపముంచిందని వైకాపా నేతలే చెప్పుకొంటుంటారు. 

మళ్ళీ మొన్న జరిగిన రెండు ఎన్నికలలో కూడా వైకాపా ఓటమికి అవీ కారణాలని చెప్పక తప్పదు. వైకాపాకు బలమూ, బలమైన శత్రువు కూడా జగన్మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. అయన పార్టీకి శల్యసారధ్యం చేస్తున్నప్పుడు తానేమీ చేయలేనని, చేసినా ప్రయోజనం ఉండదని గ్రహించినందునే ప్రశాంత్ కిషోర్ కీలకమైన ఎన్నికల ముందు తిరిగి వెళ్ళిపోయుండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. 

ఈ రెండు ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు పోల్ మేనేజ్ మెంట్ చేశారని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నప్పటికీ చంద్రబాబు నాయుడే తెదేపాకు ఎన్నికల వ్యూహనిపుణుడుగా వ్యవహరించి పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టారని చెపుతున్నట్లుంది. అవును నిజమే కదా! మరి ఈ ఎన్నికలలోనే బాబు వ్యూహాలకు చిత్తయిన జగన్ వచ్చే ఎన్నికలలో ఏవిధంగా గెలవాలనుకొంటున్నారో..ఏమో?


Related Post