విక్రమార్కుడికి ఉత్తముడి మద్దతు ఉండదా?

September 02, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ లో అందరూ పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోనే కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికలలో ఆయనే పార్టీకి నాయకత్వం వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. కానీ పార్టీలో ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెరాసను ఉద్దేశ్యించి చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. 

దానిపై తెరాస నేతలు వెంటనే స్పందించారు కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి పార్టీలో ఒక్క నేత కూడా విక్రమార్కకు అండగా నిలబడి మాట్లాడలేదు. తెరాస నేతలు ఘాటుగా స్పందిస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతుగా అదే స్థాయిలో ప్రతిస్పందించి ఉండి ఉంటే తామందరం ఒక్క త్రాటిపై ఉన్నట్లు నిరూపించుకొన్నట్లయ్యేది. కానీ మాట్లాడకపోవడంతో తమ మద్య లుకలుకలు కొనసాగుతున్నాయని చాటుకొన్నట్లయింది.

ఉత్తం కుమార్ రెడ్డి సహా టి-కాంగ్రెస్ నేతలు ఎవరు ఎప్పుడు మాట్లాడినా వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెపుతుంటారు. కానీ నేతల మధ్య ఇంత బలహీనమైన సంబంధాలు, అభిప్రాయభేదాలు ఉన్నప్పుడు ఏవిధంగా అధికారంలోకి రాగలము? అని ఆలోచించరు.

కోమటిరెడ్డి వెంకట రెడ్డి రెండుమూడు నెలల క్రితం నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించాలనుకొన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అనుమతించలేదు. తాజా సమాచారం ప్రకారం భట్టి విక్రమార్క రాష్ట్రంలో పాదయాత్ర చేయాలనుకోగా, దానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి తీసుకోవలసి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇదివరకు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు కాంగ్రెస్ నేతలు కూడా సంఘీభావం తెలిపారు. కానీ స్వంత పార్టీ నేతలు బహిరంగసభలు, పాదయాత్రలు చేయాలనుకొంటే దానికి పార్టీలో అందరూ మద్దతు పలకకపోగా అభ్యంతరాలు చెప్పడం నిజమైతే కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకొని రాష్ట్రంలో పార్టీని ఏవిధంగా ఎవరు నడిపించాలో ఇప్పుడే నిర్ణయించుకొంటే మంచిది. 


Related Post