రైతు సమితులలో మహిళా రైతులకు పెద్దపీట

September 01, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి తద్వారా రైతన్నల సంక్షేమం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతులతో కూడిన రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసే కార్యక్రమం నేటి నుంచే మొదలైంది. వాటిలో ప్రతీ స్థాయి సమితిలలో మహిళా రైతులకు కూడా మూడోవంతు స్థానం కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయం చాలా అభినందనీయం. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా రైతు కుటుంబాలలో పురుషులతో బాటు మహిళలు కూడా సమానంగా అన్ని పనులలో పాల్గొంటుంటారు. కొన్ని చోట్ల మహిళా రైతులే వ్యవసాయం చేస్తుంటారు. కానీ వారికి ఏనాడూ తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించలేదు. మొట్టమొదటిసారిగా ఈ రైతు సమన్వయ సమితిలలో ద్వారా వారికి సముచిత గౌరవం లభించబోతోంది.

వీటిలో బడుగుబలహీనవర్గాల రైతులు కూడా సభ్యులుగా ఉండాలనే మరో నిబంధన కూడా చాలా మంచి నిర్ణయమే. కానీ కులమతాలను పరిగణనలోకి తీసుకొని సభ్యత్వం కల్పించడం చిన్న, సన్నకారు, కౌలు రైతులను సభ్యులుగా తీసుకొని ఉంటే ఈ సమితుల ద్వారా ప్రభుత్వం అందించే సహాయసహకారాలు అర్హులైన రైతులకు చేరుతుంది. కులమతాలను పరిగణనలోకి తీసుకొని బలహీనవర్గాలు లేదా మైనార్టీలకు చెందిన భూస్వాములను సభ్యులుగా ఉన్నట్లయితే ఏమవుతుందో ఊహించవచ్చు. 

ఇక ఈ సమితిల ఏర్పాటుపై అప్పుడే ప్రతిపక్షాలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తెరాస నేతలు చెపుతున్న సమాధానాలు వాటిని నివృతి చేయకపోగా ఇంకా పెంచేలా చేస్తున్నాయి. “తెలంగాణా రైతు సమితి” అంటే సహజంగానే అవి తెరాస అనుబంద సంస్థలనిపిస్తోంది. వాటిలో 1.75 లక్షల మంది రైతు సైన్యం చేరబోతోందని చెప్పడం గమనిస్తే ఈ సమితుల ద్వారా రాష్ట్రంలో రైతులందరినీ తెరాసవైపు మళ్ళించబోతున్నట్లు కనిపిస్తోంది. 

వీటి ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి హరీష్ రావు చెప్పిన సమాధానం వాటి ఏర్పాటులో చిత్తశుద్ధిని చాటిచెప్పకపోగా వారి అనుమానాలను ఇంకా బలపరుస్తున్నట్లుంది. ఆయన ఏమన్నారంటే “ఇదివరకు కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఇటువంటివి ఏర్పాటు చేసి నిధులు జేబులో వేసుకోలేదా? కానీ మేము రాజకీయాలకు అతీతంగా నిజమైన రైతులతో సమితులను ఏర్పాటు చేస్తుంటే వాటిని అడ్డుకొంటామని కాంగ్రెస్ నేతలు బెదిరించడం సిగ్గుచేటు,” అని అన్నారు.

ఏమైనప్పటికీ ఈ రైతు సమితులను తెరాస అనుబంద సంఘాలుగా మార్చి వచ్చే ఎన్నికలలో వాటిద్వారా లబ్ది పొందాలని ప్రయత్నించకుండా వాటితో రైతుల జీవితాలలో వెలుగులు నింపితే ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 


Related Post