హైకోర్టులో కూడా జగన్ కు ఎదురుదెబ్బ

September 01, 2017


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గ్రహాలు ప్రతికూలంగా మారినట్లున్నాయి. ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నంద్యాల ఎన్నికలలో వైకాపా తప్పకుండా చాలా బారీ మెజార్టీతో  గెలుస్తుందని భావిస్తే తెదేపా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ వెంటనే జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కూడా తెదేపా చేతిలో ఓడిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండూ చాలవన్నట్లు హైకోర్టులో కూడా నిన్న మరో ఎదురుదెబ్బ తగిలింది.

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తాను షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చాననే సంగతి పట్టించుకోకుండా అక్టోబర్ నెల నుంచి 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేయబోతున్నట్లు జగన్ ప్రకటించేశారు. అక్రమాస్తుల కేసులలో ప్రతీ శుక్రవారం హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో జరిగే విచారణకు జగన్ స్వయంగా హాజరుకావలసి ఉంది. అయితే గతంలో చాలాసార్లు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది కనుక ఈసారి కూడా అనుమతిస్తుందనే నమ్మకంతోనే ముందుగా కోర్టు అనుమతి తీసుకోకుండా పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించేశారు. తరువాత అక్రమాస్తుల కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్స్ వేయగా కోర్టు వాటినన్నిటినీ నిన్న తిరస్కరించింది. 

"కోర్టు విచారణకు హాజరు కాకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి హటాత్తుగా ఈ పాదయాత్ర పెట్టుకొన్నట్లున్నారు. తీవ్ర ఆర్ధిక నేరాలలో నిందితుడుగా ఉన్న జగన్ కేసుల విచారణకు హాజరుకాకుండా మినహాయింపునివ్వడం కుదరదు. కావాలనుకొంటే దిగువకోర్టులోనే ఎప్పటికప్పుడు పిటిషన్లు వేసుకొని అనుమతి కోరవచ్చు. ఒకవేళ అతనికి సెక్షన్ : 205 ప్రకారం మినహాయింపు ఇవ్వవచ్చని న్యాయమూర్తి భావిస్తే ఇస్తారు లేకుంటే ప్రతీ శుక్రవారం కేసుల విచారణకు తప్పనిసరిగా హాజరుకావలసిందేనని" హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి నిన్న తీర్పు చెప్పారు. కనుక జగన్మోహన్ రెడ్డికి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు.

“అన్న వస్తున్నాడు... మీ కోసం నవరత్నాలు (ఎన్నికల హామీలు) తీసుకువస్తున్నాడు..” అని వెళ్ళి ప్రజలకు చెప్పండని జగన్ కొన్ని రోజుల క్రితమే తన పార్టీ నేతలు, కార్యకర్తలకు గట్టిగా చెప్పారు. కానీ హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో పాదయాత్ర చేయలేని పరిస్థితి ఏర్పడింది. . "ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్మోహన్ రెడ్డా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నాడు?" అని తెదేపా నేతలు ఇప్పటికే అవహేళన చేస్తున్నారు.  ఒకవేళ జగన్ పాదయాత్ర చేయదలిస్తే తప్పనిసరిగా ప్రతీ శుక్రవారం కోర్టు విచారణ కోసం బ్రేక్ తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు తెదేపా నేతలు ఇంకా అవహేళన చేయవచ్చు. కనుక జగన్ పాదయాత్ర కూడా చేస్తారో చేయరో తెలియదు. 


Related Post