ఆర్.బి.ఐ.ది ఒకమాట...జైట్లీ మరోమాట!

August 31, 2017


img

పాత పెద్దనోట్ల రద్దు చేస్తున్నప్పుడు దాని ప్రధాన లక్ష్యాలు: దేశంలో నల్లధనం వెలికితీయడం, చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీని తొలగించడం, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, మావోయిస్టులు వంటి సంఘవిద్రోహ శక్తులకు నిధులు అందకుండా కట్టడిచేయడం వగైరా వగైరా..అని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు, భాజపా నేతలు, ఎన్డీయే కూటమిలో నేతలు కోరస్ పాడారు. అయితే వారు చెప్పినవాటిలో ఏ ఒక్క లక్ష్యం నెరవేరలేదని అప్పుడే స్పష్టం అయిపోయింది. 

ఆ తరువాత నగదురహిత లావాదేవీలను ముందుకు తీసుకువచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల బలవంతం మీద, కొన్ని విధిలేని పరిస్థితులలో మాత్రమే ప్రజలు ఆవిధంగా కొన్నిరోజులు లావాదేవీలు చేశారు. తరువాత మళ్ళీ మామూలే. నోట్లరద్దు వలన అనుకొన్న లక్ష్యాలు ఏవీ సాధించలేకపోయినా నేటికీ దేశవ్యాప్తంగా నగదు కొరత నెలకొనే ఉంది. దేశంలో దాదాపు సగానికి పైగా ఎటిఎంలు మూతపడ్డాయి లేదా నగదు లేక నిరుపయోగంగా మిగిలిపోయాయి. 

ఈ నేపద్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న గొప్పగా చేసిన ఒక ప్రకటనను సాక్షాత్ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తప్పు పట్టడం గమనిస్తే ఈ మొత్తం వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ తో సహా అందరూ ఎంత అయోమయస్థితిలో ఉన్నారో అర్ధం అవుతుంది.  

ఆర్.బి.ఐ. ఏమి చెప్పింది అంటే, నోట్లరద్దుతో సర్క్యూలేషన్ లో ఉన్న మొత్తం రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీలో రూ.15.28 లక్షల కోట్లు రూ.500, 1,000 నోట్ల రూపంలో బ్యాంకులకు వెనక్కు తిరిగి వచ్చేసింది. అంటే చలామణిలో ఉన్న పాతనోట్లలో దాదాపు 99 శాతం వెనక్కు వచ్చేసినట్లే,” అని తెలిపింది.

ఆర్.బి.ఐ. ప్రకటనపై కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ “వెనక్కు తిరిగి వచ్చేసిన నోట్లన్నీ తెల్లధనం అనుకోవడానికి లేదు. అయితే నోట్లరద్దు వలన ఇప్పుడు నగదు లావాదేవీలలలో పారదర్శకత వచ్చింది. ఇంతకు ముందు అంచనాలకే పరిమితమైన ఆర్ధిక వ్యవహారాలన్నిటికీ ఇప్పుడు ఖచ్చితమైన లెక్కలు కనిపిస్తున్నాయి. ఆర్దికలావాదేవీలన్నీ ఇప్పుడు ఒక పద్దతిలోకి వచ్చాయి,” అని అన్నారు. 

చలామణిలో ఉన్న మొత్తం నగదు అంతా బ్యాంకులకు తిరిగివచ్చినంత మాత్రాన్న అది తెల్లదనం కాదనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ ఆ విషయం ఆర్.బి.ఐ.కి తెలియకపోవడమే వింత. 

పాతనోట్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, 2,000 నోట్లు ప్రవేశపెట్టగానే, నల్లకుభేరులు అందరూ తమవద్ద నల్లధనాన్ని ఆ కొత్తనోట్ల రూపంలోకి ఏవిధంగా ఏ స్థాయిలో మార్చేసుకొన్నారో ఆదాయశాఖ దాడులలో పట్టుబడిన వేలకోట్ల విలువగల కొత్తనోట్లే చాటిచెప్పాయి. కానీ చలామణిలో ఉన్న నగదు వచ్చేస్తే అదంతా తెల్లధనమేనన్నట్లు మురిసిపోయి ఆర్.బి.ఐ. హడావుడిగా ఆ విషయం ప్రకటించేసింది. 

ఆర్.బి.ఐ.కే ఈ విషయంలో ఇంత అయోమయం ఉన్నప్పుడు నోట్లరద్దు చేసే సాహసానికి ఏవిధంగా పూనుకొందో? నోట్లరద్దు వలన నల్లధనం వెలికిరాలేదని అరుణ్ జైట్లీ మాటలే స్పష్టం చేస్తున్నాయి. దాని వలన ఆశించిన ప్రయోజనం కలుగలేదు. దాని కంటే నగదు చలామణిపై కటినమైన అప్రకటిత ఆంక్షలు విధించడం, నయాన్నో భయాన్నో అందరినీ నగదురహిత లావాదేవీలు చేసేలా చేయడం, తరువాత జి.ఎస్.టి. అమలులోకి తీసుకురావడం వంటి చర్యల వలననే ఆర్దికలావాదేవీలలో పారదర్శకత, వాటిపై ప్రభుత్వానికి నియంత్రణ వచ్చింది. అంటే నోట్లరద్దు చేయకుండా ముందే ఈ పనులు చేసి ఉంటే సరిపోయేదని స్పష్టం అవుతోంది. కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అంటే బహుశః ఇదేనేమో?


Related Post