తమిళనాడులో ఎప్పుడు ఏమి జరుగుతుందో...సస్పెన్స్

August 31, 2017


img

ఆరు నెలల క్రితం జయలలిత చనిపోయినప్పటి నుంచి తమిళనాడులో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త రాజకీయ పరిణామాలు జరుగుతున్నా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు చేతులు కలిపి అధికారం పంచుకోవడంతో కధ సుఖాంతం అయ్యిందనుకొంటే శశికళ మేనల్లుడు దినకరన్ రంగప్రవేశం చేసి కధను మళ్ళీ మలుపు తిప్పాడు. సుమారు 40 అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు తన పక్షాన్న ఉన్నారని ప్రకటించాడు. అయితే 20 మందికి పైగా అతని పక్షాన్న ఉన్నట్లు స్పష్టం అయ్యింది. దీనితో పళని, పన్నీర్ వర్గాలకు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకొని కూర్చొంటే, దినకరన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి తమ 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు తెలియజేసే లేఖ ఇచ్చి, మైనార్టీలో పడిన పళని ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. కానీ గవర్నర్ అతని విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం విశేషం. 

ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా గవర్నరును కలిసి అన్నాడిఎంకె ప్రభుత్వం మైనార్టీలో పడింది కనుక ముఖ్యమంత్రి పళనిస్వామిని తక్షణమే బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. అయితే గవర్నర్ చెప్పిన సమాధానం విని స్టాలిన్ షాక్ అయ్యారు. అన్నాడిఎంకె ఎమ్మెల్యేల మద్య విభేదాలున్నప్పటికీ వారందరూ ఇంకా ఒకే ఆ పార్టీలోనే ఉన్నారు కనుక బలపరీక్ష అవసరం లేదని భావిస్తున్నానని చెప్పారు. అంటే గవర్నరే అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కాపాడుతున్నట్లు స్పష్టం అవుతోంది. 

పళని ప్రభుత్వానికి 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకొన్న వెంటనే ముఖ్యమంత్రిని గవర్నర్ బలపరీక్షకు ఆదేశించి ఉండాలి కానీ ఆవిధంగా చేయకుండా ఆ 20 మంది ఎమ్మెల్యేలను నయాన్నో, భయన్నో తమవైపు తిప్పుకొనేందుకు పళని, పన్నీర్ వర్గాలకు గవర్నర్ తగినంత సమయం ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారిరువురికీ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఉన్నందునే ఈ అవకాశం లభించిందని చెప్పకతప్పదు. 

తమిళనాడు గవర్నర్ తీరుపై డిఎంకె, దినకరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తాము రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిపి పిర్యాదు చేయబోతున్నట్లు దినకరన్ చెప్పారు. కానీ డిల్లీ పెద్దలే తెర వెనుక ఉండి ఈ తమిళరాజకీయాలను నడిపిస్తున్నప్పుడు ఇక దినకరన్ డిల్లీ వెళ్ళి ఎవరికి పిర్యాదు చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం ఉంటుంది?


Related Post