మిషన్ భగీరథ గొప్పదనం బయటవాళ్ళు గుర్తిస్తున్నారు కానీ...

August 31, 2017


img

స్వీడన్ దేశంలో మంగళవారం నుంచి వరల్డ్ వాటర్ వీక్-2017 సదస్సులు జరుగుతున్నాయి. వాటిలో తెలంగాణా రాష్ట్రం తరపున హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్ పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ స్వచ్చమైన మంచినీరు అందించడానికి తమ ప్రభుత్వం రూ.43,000 కోట్లు వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినప్పుడు సదస్సుకు హాజరైన వివిధ దేశాల సభ్యులు హర్షద్వానాలతో అభినందనలు తెలియజేశారు. 

ఇక భారత్ లో వివిధ రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథ పధకం పట్ల చాలా ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర త్రాగునీటి శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఆ శాఖకు చెందిన కొందరు ఇంజనీర్లు, అధికారులు మిషన్ భగీరథ పధకాన్ని అధ్యయనం చేసేందుకు మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటన చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకొన్నారు. 

తొలిరోజు పర్యటనలో అంటే మంగళవారంనాడు ఎర్రమంజిల్ లోని ఆర్‌.డబ్ల్యూ.ఎస్. కార్యాలయంలో ఇంజినీర్ ఇన్-చీఫ్ బి సురేందర్‌రెడ్డి వారికి ఈ ప్రాజెక్టు లక్ష్యం, దానిని నిర్మిస్తున్న విధానం, తదితర వివరాలను వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, ఆ తరువాత వారిని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటిని చూపించారు. బుధవారం మెదక్-సింగూరు మద్య జరుగుతున్న పనులను చూపించారు. గురువారం ఎల్లూరు-మహబూబ్ నగర్ మద్య జరుగుతున్న మిషన్ భగీరథ నిర్మాణ పనులను ఆ బృందం అధ్యయనం చేస్తుంది. 

ప్రజలకు చాలా ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన చేయడం, దానికి ఇంత గొప్పగా రూపకల్పన చేసి అంతే సమర్ధంగా, వేగంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తుండటాన్ని చూసి వారు చాలా మెచ్చుకొన్నారు. ఈ ప్రాజెక్టు యావత్ దేశానికే ఆదర్శప్రాయమైనదని, తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అందుకే అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని, ఇది పైపుల కంపెనీలకు మేలు చేకూర్చేందుకే చేపట్టారని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ దేశవిదేశాల ప్రతినిధులు ఈ ప్రాజెక్టు గొప్పదనాన్ని గుర్తించి దాని అధ్యయనం కోసం వచ్చి ఇంతగా మెచ్చుకొని తమ రాష్ట్రాలలో కూడా అటువంటిది అమలుచేస్తామని చెప్పడం తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలు అందరికీ గర్వకారణమే కదా! 


Related Post