తెరాస ఎమ్మెల్యేలు మా టచ్చులోనే ఉన్నారు: భట్టి

August 30, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఒక సంచలనమైన విషయం బయటపెట్టారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన నిన్న గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ వ్యవహార శైలితో విసిగిపోయిన కొంతమంది తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. అలాగే వరంగల్ కు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే కూడా మాతో టచ్చులో ఉన్నారు. సుమారు 7-8 మంది మంత్రులు, 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే తగిన సమయం సందర్భం చూసుకొని వారందరూ పార్టీ మారుతారు కనుక వారి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేము,” అని చెప్పారు.

మల్లు భట్టివిక్రమార్క చెప్పింది నిజం కావచ్చు లేదా మైండ్ గేమ్ అయ్యుండవచ్చు. నిజం అయ్యేందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికలలోగా శాసనసభ స్థానాలు తప్పకుండా పెరుగుతాయని, కనుక పార్టీలో ఉన్నవారు, కొత్తగా చేరినవారు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అందరికీ పార్టీ టికెట్స్ లభిస్తాయని ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చేవారు. కానీ ఆయన ప్రధాని మోడీని కలిసి వచ్చిన తరువాత సీట్ల పెంపు ఉండకపోవచ్చని అయినా తమకేమీ ఇబ్బంది ఉండబోదని చెప్పారు. కానీ ఉంటుందని అందరికీ తెలుసు. 

టికెట్ల పంపిణీలో మొదటనుంచి తెరాసలో ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. కనుక కొత్తగా చేరినవారు టికెట్స్ దక్కనప్పుడు వారు మళ్ళీ ఇతర పార్టీలలోకి వెళ్ళిపోవడం ఖాయం. ఒకవేళ కొత్తవారికే టికెట్లు ఇచ్చినా అప్పుడు పాతవారు వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కనుక టికెట్ దొరకదని భావిస్తున్నవారు కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలున్నాయి.  

ఇక ఫిరాయింపులకు అవకాశం ఉందని చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది. అది ఏమిటంటే, ఈసారి 6 నెలలు ముందుగానే సార్వత్రిక ఎన్నికలు జరుపాలని కేంద్రం భావిస్తోంది. అదేవిధంగా ఈసారి 6 నెలలు ముందుగానే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. కనుక పార్టీ మారే ఆలోచన ఉన్నావారు ఆలోగానే పార్టీలు మారవలసి ఉంటుంది లేకుంటే వారి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. 

ఇక మూడో కారణం, వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ భాజపాయే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెలంగాణాలో ఆ అవకాశం కనబడటం లేదు. కనుక తెరాసను డ్డీకొని విజయం సాధించగల గెలుపు గుర్రాల కోసం అది చూస్తోంది. తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోయిన కేంద్రంలో అధికారంలో రాగలగడం భాజపాకు కలిసివచ్చే అంశం అవుతుంది. కనుక తెరాసలో టికెట్స్ దొరకని బలమైన నేతలు కాంగ్రెస్ లేదా భాజపాలలో చేరే అవకాశాలున్నాయి.  


Related Post