ఏపిలో కాంగ్రెస్ విలవిల..

August 30, 2017


img

ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే ముసలి నక్కపై తాటి పండు పడినట్లయింది. ఏపిలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన ఆ పార్టీ తెదేపా, వైకాపాలు చాలా ప్రతిష్టాత్మకంగా భావించి పోరాడుతున్న నంద్యాల ఉపఎన్నికలలో పోటీ చేయడమే తప్పు. 

ఒక రాజకీయ పార్టీగా దానికి ఆ హక్కు ఉంది కనుక ఎవరూ తప్పు పట్టలేరు కానీ అది వ్యూహాత్మక తప్పిదంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఉపఎన్నికలలో ఎలాగూ గెలిచే అవకాశం లేదని తెలిసి ఉన్నప్పుడు ఏదో వంకతో వాటికి దూరంగా ఉండిపోతే దానికి గౌరవం మిగిలి ఉండేది. కానీ పోటీకి దిగి కేవలం 1,382 మాత్రమే సంపాదించుకొని ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో స్వయంగా చాటుకొన్నట్లు అయ్యింది. ఆంబోతుల పోరులో లేగదూడ నలిగిపోయినట్లు ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ నలిగిపోయింది. 

అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని ఈ ఉపఎన్నికలనే తెదేపా, వైకాపాలు ప్రతిష్టాత్మకంగా భావించి పోరాడినప్పుడు, ఇక వాటికి నిజంగానే జీవన్మరణ సమస్య వంటి 2019 ఎన్నికలలో ఇంకెంత భీకరంగా పోరాడుకొంటాయో ఎవరూ ఊహించలేరు. కనుక ఈ ఉపఎన్నికలలోనే ఇంత దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలలో పోటీ చేస్తే ఏమవుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి గురించి కనీసం మీడియాలోనైనా చర్చ జరుగలేదంటే ఆ పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ ఓటమిపై సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఘాటుగా స్పందించారు. తెదేపా, వైకాపాలపై కాదు...తమ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై! “ఈ ఘోరపరాజయానికి ఆయనే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో నాయకత్వ సమస్య ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి. కనుక రఘువీరారెడ్డి తక్షణం ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవిలో నుంచి తప్పుకోవాలి,” అని అన్నారు. 

అయితే రఘువీరారెడ్డే కాదు..ఎవరూ కూడా ఏపిలో కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని చెప్పవచ్చు కనుక ఆయన రాజీనామా చేసినా చేయకున్నా తేడా ఏమీ ఉండదు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ అక్కడా తెరాస ధాటికి నిలువలేకపోతోంది. జాతీయ స్థాయిలో కూడా అదే పరిస్థితి. మోడీ ధాటికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిలువకలేకపోతున్నారు. ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలే ఆమోదించడం లేదు కనుక అయన పార్టీ పగ్గాలు చేపట్టలేకపోతున్నారు. ఆయనకు బదులు ప్రియంకా వాద్రాకు పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయినా వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీని, ఎన్డీయే కూటమిని ఓడించే అవకాశాలు కనబడటం లేదు. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పరిస్థితి ఈవిధంగా ఉంటే ఇక రాష్ట్ర స్థాయిలో వేరేగా ఉంటుందా?      



Related Post