రెండు తెలుగు రాష్ట్రాలలో డేరా బాబాలు?

August 30, 2017


img

బాహుబలి సీజన్ నడుస్తున్నప్పుడు ప్రధాని మోడీ మొదలు రాష్ట్ర నేతల వరకు అందరూ బాహుబలి పేరును తెగ వాడేసుకొన్నారు. బాహుబలి హీరో కనుక అందరూ అతనిని స్వంతం చేసుకొనేవారు. ప్రస్తుతం డేరా బాబా సీజన్ మొదలయింది. అయితే అతను సినిమాలలో హీరోగా నటించినప్పటికీ నిజజీవితంలో విలన్ గా నిర్దారింపబడి జైలుపాలయ్యాడు కనుక రాజకీయ నేతలు తమ ప్రత్యర్ధులను అతనితో పోల్చి మాట్లాడుతున్నారు. 

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని డేరా బాబాగా అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, “డేరా బాబాలాగే ఇక్కడ మాకు ఒక బాబా ఉన్నాడు. అతనే జగన్ బాబా. అతను కూడా అచ్చం డేరా బాబాలాగే వ్యవహరిస్తున్నాడు. ఈ మూడేళ్ళలో అతని అనుచితమైన మాటలు, చేతలు, మా ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు పన్నిన కుట్రలు చూస్తే అతను డేరాబాబాకు ఏమాత్రం తీసిపోడనిపించుకొన్నాడు. అందుకే అతనిని జగన్ బాబా అనక తప్పదు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో అతను ఎంత ఉన్మాదంగా మాట్లాడాడో, ప్రవర్తించాడో అందరూ చూశారు. అందుకు నంద్యాల ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా అతని ప్రవర్తన మారలేదు. వచ్చే ఎన్నికలలో ప్రజలు మరింత గట్టిగా అతనికి బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 

తెదేపా చేస్తున్న ఈ వ్యాఖ్యలపై వైకాపా నేతలు కూడా ధీటుగా స్పందించారు. “ఓటుకు నోటు కేసు మొదలుకొని కాల్ మనీ, ఇసుక మాఫియా, నంద్యాల ఉపఎన్నికలలో ప్రజలను భయబ్రాంతులను చేసి బలవంతంగా ఓట్లు వేయించుకోవడం వరకు చంద్రబాబు చేసిన, చేస్తున్న నేరాలు, ఘోరాలకు అంతు లేదు. కనుక డేరాబాబాగా గుర్తింపు పొందడానికి కేవలం చంద్రబాబుకి మాత్రమే హక్కు ఉంది,” అని వైకాపా నేతలు వాదిస్తున్నారు.

ఇక తెలంగాణాలో కూడ డేరా బాబా గేమ్ మొదలయింది. “నిరంకుశంగా, అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, భూకుంభకోణాలు, ఇసుక మాఫియాలను వెనకేసుకొని వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ డేరా బాబా వంటివారని” తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి తెరాస నేతలు ఇంకా స్పందించవలసి ఉంది. స్పందిస్తే అది ఏవిధంగా ఉంటుందో ఊహించవచ్చు.   


Related Post