తెలంగాణాలో మళ్ళీ పటేల్, పట్వారీ వ్యవస్థ?

August 30, 2017


img

తెరాస సర్కార్ అమలుచేస్తున్న విధానాలు రాష్ట్రంలో మళ్ళీ ఆనాటి పటేల్, పట్వారీ వ్యవస్థలకు ప్రాణం పోయబోతోందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. తెరాస మంత్రుల కనుసన్నలలో తెరాస కార్యకర్తలతో ఏర్పాటుచేయబోయే రైతు సమన్వయ సంఘాలతో మళ్ళీ అటువంటి నామినేటడ్ వ్యవస్థే ఏర్పాటు కాబోతోందని, అప్పుడు గ్రామాలలో రైతులు ఏ అవసరం పడినా ‘బాంచన్ దొర...నీ కాల్మొక్తా’ అని వారి కాళ్ళపై పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్: 39 తెలంగాణాలో ప్రజాస్వామ్య వ్యవస్థను అంతమొందించి మళ్ళీ అటువంటి భూస్వామ్య వ్యవస్థను సృష్టించడానికే ఉపయోగపడుతుందని అన్నారు. దానితో రాష్ట్రంలో భూమాఫియా తయారయ్యే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. 

భూముల లెక్కలను, వాటి యాజమాన్య హక్కుల నిర్ధారణను రెవెన్యూ శాఖ చేపట్టవలసి ఉంది. అలాగే వ్యవసాయ సాగు వివరాలను వ్యవసాయ శాఖ చేపట్టవలసి ఉంది. కానీ ఆ రెండు పనులను తెరాస నేతలు, కార్యకర్తలకు అప్పగించడం ద్వారా ఇకపై రాష్ట్రంలో రైతులు ఏ అవసరం సహాయం కావాలన్నా వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి వస్తుందని మల్లు భట్టివిక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్: 39 ఉపసంహరించుకొని తెరాస నేతలు, కార్యకర్తలతో రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ప్రతిపాదనలను విరమించుకోవాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయబోయే రైతు సమన్వయ సమితిలు రైతుల సంక్షేమం, వారిని దళారీ వ్యవస్థల నుంచి రక్షణ కల్పించి మేలు చేకూర్చేందుకే ఏర్పాటుచేస్తున్నట్లు తెరాస సర్కార్ చెపుతోంది. విద్యార్ధి సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు అనుబంద సంఘాలున్నాయి. అవి వారి ప్రయోజనాలను కాపాడటం కంటే తమ తమ పార్టీల రాజకీయ అవసరాలు, ఆలోచనలు, ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెరాస నేతలు, కార్యకర్తలతో కొత్తగా ఏర్పాటు కాబోతున్న రైతు సమన్వయ సమితి తెరాస అనుబంద సంఘాలుగా రూపొందితే ఆశ్చర్యం లేదు. అప్పుడు మల్లు భట్టివిక్రమార్క వ్యక్తం చేస్తున్న అనుమానాలు వాస్తవరూపం దాల్చడం తధ్యం.


Related Post