దానికి ఆగస్ట్30 ముహూర్తం

August 29, 2017


img

తెలంగాణా గ్రామాలలో జీవనోపాధికల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటి చేపపిల్లల పెంపకం. రాష్ట్రంలోగల రిజర్వాయర్లలో, మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీయబడిన చెరువులలో, మత్స్య శాఖకు చెందిన చెరువులలో ఏటా కోట్ల సంఖ్యలో చేపపిల్లలను విడిచిపెడుతోంది ప్రభుత్వం. 

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు ఖర్చు చేసి సుమారు 29 కోట్ల చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడిచిపెట్టింది. వాటి వలన సుమారు 2.79 లక్షల మంది మత్స్యకారులకు జీవనోపాధి లభించింది. చేపల ఉత్పత్తి పెరగడంతో వాటిని అమ్ముకొనేందుకు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రత్యేకంగా చేపల మార్కెట్లను నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మార్కెట్లకు చేపలను తరలించడానికి మత్స్యకారులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కూడా అందజేయాలని భావిస్తోంది.  

ఇక ఈ ఏడాది ఆగస్ట్ 30 వతేదీన 69.66 కోట్ల చేపపిల్లలను విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. 

రాష్ట్రంలో చెరువుల పూడికతీత, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ ఈ చేపల పెంపకం కూడా అదేస్థాయిలో పెరుగుతుంటుంది కనుక ఒకటి రెండేళ్ళలో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు కూడా చేపలను ఎగుమతి చేసే స్థాయికి  తెలంగాణా రాష్ట్రం ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ క్రెడిట్ నిసందేహంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. 



Related Post