హుస్సేన్ సాగర్ ఒడ్డున అమరవీరుల స్థూపం?

August 29, 2017


img

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సుమారు 1,400 మంది బలిదానాలు చేసుకొన్నారని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వాదన. కానీ అందులో సగం కంటే తక్కువ మందిని మాత్రమే ప్రభుత్వం అమరవీరులుగా గుర్తించింది.  అమరవీరుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పుడు ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వారి నుంచి అమరవీరుల వివరాలు తీసుకొని తగిన చర్యలు చేపడితే అందరూ హర్షించేవారు. కానీ తెరాస సర్కార్ తాను చెప్పిందే లెక్క అన్నట్లుగా వ్యవహరించడం వలన తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్న అనేకమంది అమరవీరులకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. వారి కుటుంబాలకు ఆర్ధికసహాయం అందకుండాపోయింది. రోడ్డున పడ్డ ఆ అమరవీరుల తల్లితండ్రులు, పిల్లలు తమను ఆదుకోమని వేడుకొంటున్నా ఎవరూ వారిని పట్టించుకొనేవారు లేకపోవడంతో వారు అమరవీరుల స్థూపం వద్ద ధర్నాలు కూడా చేశారు. అయినా ఫలితం లేదు. 

అమరవీరులను గుర్తించడానికి ప్రభుత్వం చొరవ చూపనప్పటికీ వారి స్మృత్యర్ధం హుస్సేన్ సాగర్ ఒడ్డున 200 అడుగుల ఎత్తుండే 8 అంతస్తుల భవనం మళ్ళీ దానిపై మరో 100 అడుగుల ఎత్తుండే స్థూపం నిర్మించడానికి సిద్దం అవుతోంది. అయితే ఆ భవనం కోసం సిద్దం చేసిన ప్రణాళికలను చూస్తే అది అమరవీరుల స్మృత్యర్ధం కాక హైదరాబాద్ కు గొప్ప పేరు తెచ్చే భవనాన్ని నిర్మిస్తున్నట్లుంది. 

లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న 2 ఎకరాలలో రూ.80 కోట్ల వ్యయంతో ఆ భవనాన్ని ప్రభుత్వం నిర్మించబోతోంది. ఆ భవనంలో రెండు అంతస్తులు భూమి క్రింద, 6 అంతస్తులు పైన ఉండేవిధంగా నిర్మించబోతున్నారు. ఆ రెండు అంతస్తులను కేవలం కార్ పార్కింగ్ కోసం కేటాయిస్తారు. వాటిలో సుమారు 350 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. 

ఇక వాటిపైన నిర్మించబోయే ఒక్కో అంతస్తు సుమారు 72,000 చ. అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఒక అంతస్తులో సమావేశాల కోసం మిగిలిన వాటిలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు వంటి ఇతర అవసరాల కోసం నిర్మిస్తున్నట్లు సమాచారం. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ అందాలను తిలకించడానికి వీలుగా టెర్రస్ పై ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. 

ఈ భవన నమూనాను తనికెళ్ళ ఇంటిగ్రేటడ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసింది. ఈ భవన నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి వచ్చే ఏడాదిలోగా పూర్తిచేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

అమరవీరులకు గన్ పార్క్ వద్ద ఇప్పటికే ఒక స్థూపం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ అక్కడికే వెళ్ళి నివాళులు అర్పిస్తుంటారు. అమరవీరుల త్యాగాలను తెలంగాణా ప్రజలు అందరూ సదా గుర్తుంచుకోవడం అవసరమే. కానీ చితికిపోయిన వారి కుటుంబాలను ఆదుకోకుండా వారి స్మృత్యర్ధం కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా ఇటువంటి బారీ భవనాలు నిర్మించాలనుకోవడంలో ఔచిత్యం ఏమిటో ప్రభుత్వానికే  తెలియాలి. 

రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పిన తెరాస సర్కార్ నేటికీ ఆ పని పూర్తి చేయలేకపోయింది. దానికి మరో ఏడాది సమయం పడుతుందని చెపుతోంది. మూడున్నరేళ్ళు పూర్తికావస్తున్నా ఇంకా పేదలకు ఇళ్ళు నిర్మించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం అట్టహాసంగా ఇటువంటి భారీ భవనాలు నిర్మించడంపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. తెలంగాణా రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు, హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తెచ్చేందుకు అటువంటి భవనాల నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ హామీలను, ప్రాధాన్యతలను మరిచిపోకూడదు.


Related Post