కేసీఆర్ వ్యూహం 2019 ఎన్నికల కోసమేనా?

August 28, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసమే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతుసంఘాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నప్పటికీ, బహుశః అవి 2019 ఎన్నికల కోసం చాలా దూరదృష్టితో అమలుచేస్తున్న గొప్ప వ్యూహంగా కనిపిస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రైతుసంఘాలను ఏర్పాటు చేసే  బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు లేదా జిల్లా రెవెన్యూ లేదా వ్యవసాయ అధికారులకు అప్పగించకుండా మంత్రులకు అప్పగించడమే అందుకు నిదర్శనంగా భావించవచ్చు.       

వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి: నిజామాబాద్, కామారెడ్డి, హరీష్ రావు: సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కేటిఆర్ : రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కడియం శ్రీహరి : వరంగల్ రూరల్, అర్బన్, జనగామ, తుమ్మల నాగేశ్వర రావు : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఈటెల రాజేందర్ : కరీంనగర్ పెద్దపల్లి, జూపల్లి కృష్ణారావు : నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులంబ గద్వాల్, లక్ష్మారెడ్డి : మహబూబ్ నగర్, జగదీశ్ రెడ్డి :నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఇంద్రకరణ్ రెడ్డి : నిర్మల్, మంచిర్యాల్, మహేందర్ రెడ్డి : రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, చందూలాల్ : భూపాలపల్లి, మహబూబాబాద్, జోగు రామన్న : అదిలాబాద్, కుమరుం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి రైతు సంఘాల ఏర్పాటు భాద్యతలు అప్పగించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణలోనే తెరాస తన ఆధిపత్యం నిరూపించుకొని దానికి ఆమోదముద్ర వేయించుకొంది. మరి అటువంటప్పుడు మంత్రుల కనుసన్నలలో ఏర్పాటు అవుతున్న రైతు సంఘాలు తెరాస సర్కార్ చెప్పుచేతలలోనే ఉండవచ్చని వేరే చెప్పనవసరం లేదు. 

పైగా రాష్ట్ర స్థాయి సంఘానికి రూ.500 కోట్లు మూలధనం సమకూర్చుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాది మే నెల నుంచి ఆ రైతు సంఘాల ద్వారానే రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 ఇవ్వబోతోంది. 

అంటే ఆ రైతు సంఘాల ద్వారానే తెరాస సర్కార్ రాష్ట్రంలో రైతులందరినీ నియంత్రించగలుగుతుందని స్పష్టం అవుతోంది. రైతు సంఘాల ఏర్పాటు, వాటి ద్వారా రైతులకు డబ్బు అందించడానికి తెరాస సర్కార్ ఎంచుకొన్న టైమింగ్ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రచించిన గొప్ప వ్యూహమేనని సూచిస్తోంది. కానీ ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమయినట్లే కనిపిస్తున్నాయి. “ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే గుణం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రైతు సంఘాలను ఏర్పటు చేస్తామని, ఎకరానికి రూ.8,000 చొప్పున ఇస్తామని చెపుతూ మరోసారి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలకే ప్రతిపక్షాలు పరిమితం అవడం అదే సూచిస్తోంది. తెరాస సర్కార్ ఈ వ్యూహాన్ని సవ్యంగా అమలుచేయగలిగితే వచ్చే ఎన్నికలలో దానికి తిరుగు ఉండదు. 


Related Post