నంద్యాల క్రెడిట్ ఎవరిది?

August 28, 2017


img

నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను తెదేపా, వైకాపాలు తమతమ కోణాలలో విశ్లేషించి చూపాయి. “ఈ ఉపఎన్నికలను తెదేపా పాలనకు రిఫరెండంగా భావించి తీర్పు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు చెప్పారు,” అని తెదేపా నేతలు చెప్పుకొంటున్నారు.

ఈ ఉపఎన్నికలలో తెదేపా విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టడం, భూమానాగిరెడ్డి మృతి సానుభూతి తెదేపాకు కలిసి వచ్చిందని శిల్పామోహన్ రెడ్డి చెప్పారు. ఇది తెదేపా పాలనకు, అభివృద్ధికి పడిన ఓట్లుగా భావించరాదని అన్నారు.

అయితే తెదేపా గెలుపు, వైకాపా ఓటమికి అసలు కారణాలు వేరే కనిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా మార్చడం జగన్ చేసిన మొదటి తప్పు. ఆనవాయితీ ప్రకారం నంద్యాల సీటును తెదేపాకు విడిచిపెట్టి ఉంటే ఇంత అవమానం ఎదుర్కోవలసి ఉండేదే కాదు. పైగా ఇంత ఖర్చు, శ్రమ తప్పేవి. ఈ ఉపఎన్నికలను చంద్రబాబు పాలనకు రిఫరెండంగా భావించి ఓట్లు వేయమని’ జగన్ అడగడం మరో పెద్ద పొరపాటు. 

ఈ ఎన్నికల ప్రచారంలో “చంద్రబాబును రోడ్డుపై కాల్చి చంపాలి..బహిరంగంగా ఉరి తీయాలి..రాళ్ళతో తరిమికొట్టాలి వంటి జగన్ మాటలు, రోజా కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం వైకాపా పట్ల ప్రజలలో దురాభిప్రాయం, చంద్రబాబు పట్ల సానుభూతిని కలిగింపజేసి ఉండవచ్చు. 

ఈ ఉపఎన్నికలే వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని వైకాపా భావించడం కూడా చాలా పెద్ద పొరపాటని చెప్పవచ్చు. అదే నిజమనుకొంటే అప్పుడే వైకాపా సగం ఓడిపోయినట్లే. 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఇదేవిధంగా వ్యవహరించడం వలననే వైకాపా త్రుటిలోవిజయం చేజార్చుకొంది. ఇప్పుడూ ఇంచుమించు అదే కారణాలతో వైకాపా ఓటమి పాలవడం గమనిస్తే వైకాపాకు బలమూ, బలహీనత రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే అర్ధం అవుతోంది. ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని ఈ ఉపఎన్నికలు మరోమారు నిరూపించి చూపాయి.  కనుక చివరిగా చెప్పుకోవలసిన మాట ఏమిటంటే, ఇది జగన్ దుందుడుకుతనంతో కొని తెచ్చుకొన్న అపజయమే తప్ప తెదేపా సాధించిన ఘనవిజయంకాదని చెప్పవచ్చు. 


Related Post