2019 ఎన్నికలు తెరాసకు పూలబాటేనా?

August 28, 2017


img

2014, 2019 తెలంగాణా శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉంది. 2014 లో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉండటం, కాంగ్రెస్ నేతల కీచులాటలు, చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఏపిపైనే దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలన్నీ తెరాసకు చాలా కలిసొచ్చాయి. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ వెంటనే తేరుకొని తెరాసకు చాలా గట్టినివ్వడంతో కేసీఆర్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేయవలసి వచ్చింది. అయినప్పటికీ తెరాస గెలుస్తుందా లేదా..గెలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వస్తుందా రాదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చివరికి తెరాసయే విజయం సాధించింది.

ఇంతవరకు కాంగ్రెస్, తెదేపాల పాలనను మాత్రమే చూసిన తెలంగాణా ప్రజలు ఈ మూడేళ్ళలో తెరాస పాలన ఏవిధంగా ఉంటుందో కూడా చూశారు. కనుక ఇప్పటికే వారు తెరాసపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరుగని అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు జరుగుతున్నాయి. కనుక ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 106 సీట్లు సాధిస్తామని కేసీఆర్ చెపుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ సంఖ్యను మరింత పెంచి మొత్తం 119 సీట్లలో 117 తామే గెలుచుకొంటామని చెప్పారు.

కానీ కేసీఆర్ చెప్పుకొంటున్నట్లుగా వచ్చే ఎన్నికలు తెరాసకు పూలబాట ఏమీ కావు. ఎందుకంటే అనేక ప్రతికూలాంశాలు కూడా కనబడుతున్నాయి. 

ప్రతిపక్షాల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం, నియంతృత్వ పోకడలు, ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ, మియాపూర్ భూకుంభకోణం, ఖమ్మం రైతులను జైలుకు పంపించి సంకెళ్ళతో కోర్టుకు తీసుకురావడం, నేరెళ్ళ ఘటన వంటివి కనబడుతున్నాయి. 

మియాపూర్ భూకుంభకోణం, ఇసుక మాఫియా, నేరెళ్ళ వంటి వ్యవహారాలలో ప్రభుత్వం కటినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హామీల అమలు విషయంలో ప్రభుత్వం చేతల కంటే మాటలకే పరిమితం అవుతోందనే విమర్శలున్నాయి. వాటిపై కాంగ్రెస్ మరియు ప్రొఫెసర్ కోదండరామ్ చేస్తున్న పోరాటాలు కూడా ప్రజలలో ఆ వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి. 

ఇక వచ్చే ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు జీవన్మరణ సమస్యవంటివి కనుక ఎట్టిపరిస్థితులలో గెలిచేందుకు వారు గట్టిగా ప్రయత్నించడం ఖాయం. వచ్చే ఎన్నికలలో తెరాసతో భాజపా చేతులు కలుపుతుందో లేదో తెలియదు. దాని దృష్టి ప్రధానంగా రాష్ట్రంలో ఎంపి సీట్లను గెలుచుకోవడంపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక ఒకవేళ తెరాసతో చేతులు కలుపకపోతే అది కూడా గట్టి పోటీనీయవచ్చు. 

గద్దర్, మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు తెరాసను వ్యతిరేకిస్తున్నారు కనుక వారు కూడా ప్రజలను ప్రభావితం చేసి తెరాస ఓట్లను చీల్చడం ఖాయం. 

కనుక తెరాస సర్కార్ కు పూర్తి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు కనబడటం లేదు అలాగని పూర్తి వ్యతిరేక పరిస్థితులు లేవు. మిగిలిన 20 నెలలో తెరాస సర్కార్ తీసుకొనే నిర్ణయాలు, ఎదురయ్యే సమస్యలు, రాజకీయ సమీకరణాలలో మార్పులు వంటివి వచ్చే ఎన్నికలలో పరిస్థితులను మార్చవచ్చు. 


Related Post