డేరా వారసురాలు హనీ?

August 28, 2017


img

అత్యాచారం కేసులో దోషిగా పేర్కొనబడిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు ఈరోజు మధ్యాహ్నం 2.30  గంటలకు సిబిఐ  కోర్టు శిక్ష ఖరారు చేయబోతోంది. హర్యానాలో మొన్న జరిగిన విద్వంసం దృష్టిలో ఉంచుకొని గుర్మీత్ కు శిక్షను అతనిని ఉంచిన రోహ్తక్ జిల్లాలోని సునరియా జైలులోనే ప్రకటించాలని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు పంచకుల సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ తీర్పు చెప్పబోతున్న సిబిఐ న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ కి భద్రతను పెంచి ఆయనను హెలికాఫ్టర్ ద్వారా రోహ్తక్ జైలుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది కనుక ప్రభుత్వం అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఇక ఈరోజు గుర్మీత్ కు సిబిఐ  కోర్టు శిక్ష ప్రకటించగానే బారీ ఎత్తున హింస చెలరేగే ప్రమాదం ఉందని నిఘావర్గాల ముందస్తు హెచ్చరికలతో రోహ్తక్, సిర్సా తదితర అనేక ప్రాంతాలలో కర్ఫ్యూ విదించి, 28 కంపెనీల పారామిలటరీ దళాలను, వేలమంది హర్యానా పోలీసులను మొహరించారు. హర్యానా, పంజాబ్, యూపి మూడు ఇరుగుపొరుగు రాష్ట్రాలైనందున మూడు రాష్ట్రాల సరిహద్దుల వద్ద భారీగా భద్రతాదళాలను మొహరించారు. వారి మోహరింపుతో రోహ్తక్, సిర్సా పట్టణాలు ఆర్మీ క్యాంపులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాలలో డేరా అనుచరులు విస్తరించి ఉండటంతో మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అల్లర్లు మొదలవుతాయోనని హర్యానా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇక గుర్మీత్ సింగ్ జైలుకు వెళ్ళడం దాదాపు ఖాయం అయ్యింది కనుక అతని దత్తపుత్రిక హనీ ప్రీత్ సింగ్ ఇన్సాన్ (30) డేరా బాధ్యతలు తీసుకోవచ్చని సమాచారం. ఆమె కూడా తన తండ్రితో కలిసి డేరా సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. తన తండ్రి చేసిన మూడు సినిమాలకు ఆమె దర్శకత్వం వహించింది.. ఆమె కూడా వాటిలో నటించింది. 

గుర్మీత్ సింగ్ కు భార్య హర్జీత్ కౌర్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. వందల కోట్ల విలువగల ఆస్తులున్న డేరా సౌధాను ఒకవేళ హనీప్రీత్ సింగ్ స్వాధీనం చేసుకొని నడిపించే ప్రయత్నం చేస్తే గుర్మీత్ సింగ్ భార్య హర్జీత్ కౌర్ కూడా వాటిపై పెత్తనం కోసం ప్రయత్నించినట్లయితే వారి మద్య ఆస్తుల కోసం గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది. అదే డేరాల పతనానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. 


Related Post