అమెరికా అధ్యక్షుడేనా ...చిల్లర పనులు చేస్తున్నది?

August 26, 2017


img

ఇంతవరకు అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించినవారిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ తమ పదవికి వన్నె తెచ్చే విధంగా చాలా హుందాగా, గౌరవంగా, వినమ్రంగా వ్యవహరించినవారే. వారికి పూర్తి విరుద్దమైన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ అని చెప్పవచ్చు. తన స్థాయికి, హోదాకు ఏమాత్రం తగని పనులు చేస్తూ, మాటలు మాట్లాడుతూ తరచూ విమర్శల పాలవుతున్నారు. కోర్టులే ఆయన నిర్ణయాలను తప్పు పడుతుంటాయి. ఆయన అనుచితమైన ప్రవర్తన, మాటతీరు కారణంగా దేశ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతోంది. ఆయన తాజాగా రీట్వీట్ చేసిన ఒక చిత్రాన్ని చూస్తే ఎవరైనా అవునని అంగీకరించకమానరు. 

 అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామాను గౌరవించాలని అందరూ ఆశిస్తారు. కానీ డోనాల్డ్ ట్రంప్ తన జాత్యాహంకారాన్ని ప్రదర్శించుకొంటూ ఒబామాను అవమానించే విధంగా ట్వీట్టర్ లో ఫోటోలు పెట్టారు. 

ఇటీవల అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. దానిపై మీడియాలో అనేక చర్చలు, వ్యాఖ్యలు, ఫోటోలు వగైరా వచ్చాయి. అవి సహజం కూడా. వాటిలో ఒక ఫోటోలో నల్లజాతీయుడైన బారక్ ఒబామాను తెల్లజాతీయుడైన డోనాల్డ్ ట్రంప్ మెల్లమెల్లగా కమ్ముకొంటూ చివరికి ఒబామా కనబడకుండా మాయం అయినట్లు, ఆయన స్థానంలో డోనాల్డ్ ట్రంప్ చిర్నవ్వులు చిందిస్తూ కనబడతారు. 

ఎవరో వ్యక్తి సృష్టించిన ఈ ఫోటోను డోనాల్డ్ ట్రంప్ తన ట్వీట్టర్ లో షేర్ చేశారు. అంటే ఆ ఫోటో..దాని ఉద్దేశ్యం రెండూ కూడా ఆయనకు నచ్చాయని, ఆమోదిస్తున్నారని స్పష్టం అయ్యింది. 

మాజీ దేశాధ్యక్షుడైన ఒబామాను, నల్లజాతి ప్రజలను ఈవిధంగా అవమానించడం ఆయన జాత్యాహంకారానికి నిదర్శనమని చాలా మంది అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్నవ్యక్తి వ్యవహరించవలసిన తీరు ఇదికాదని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ డోంట్ కేర్ అన్నట్లుగా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తుంటారు. 


Related Post