ప్రజల కంటే రాజకీయాలే మీకు ముఖ్యమా? హైకోర్టు ప్రశ్న

August 26, 2017


img

డేరా బాబా అనుచరులు నిన్న ఒక్కరోజునే హర్యానాలో పంచకుల పట్టణంలో చేసిన విద్వంసాన్ని చూసి పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

“పంచకుల పట్టణం తగులబడిపోతుంటే ప్రభుత్వం ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చొంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం అంధోళనకారులకు ప్రభుత్వం లొంగిపోయింది. మీకు ఎప్పుడూ మీ రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రాణాలు, ప్రభుత్వాస్తుల రక్షణ గురించి పట్టించుకోరా? ఇక్కడ ఏమి జరుగబోతోందో మీకు ముందే తెలిసి ఉన్నప్పటికీ వాటిని నివారించడానికి ముందే ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు?” అని హైకోర్టు ప్రశ్నించింది. 

సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ‘రోమ్ నగరం తగులబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకొంటూ కూర్చోన్నట్లు’ అని చెప్పుకొంటారు. కానీ ఇప్పుడు దానిని మార్చి ‘పంచకుల పట్టణం తగులబడిపోతుంటే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ కట్టర్ లాగ కూర్చోన్నారని’ చెప్పుకోవాలేమో?

హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ కట్టర్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక ఇటువంటి ఘటనలను నివారించడానికి కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సహాయసహకారాలు సులువుగా పొందవచ్చు. కానీ లక్షల సంఖ్యలో ఉన్న డేరా అనుచరులను గట్టిగా కట్టడిచేసే ప్రయత్నాలు చేస్తే వారి ఓటు బ్యాంకు కోల్పోయే ప్రమాదం ఉందనే భయంతోనే కట్టర్ ప్రభుత్వం మెతకగా వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడినట్లు అర్ధం అవుతోంది. ఆ కారణంగా నిన్న ఒక్కరోజు జరిగిన అల్లర్లలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. వందల కోట్లు విలువగల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి. 

దీనికి ముఖ్యమంత్రి మనోహర్ కట్టర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. హైకోర్టు కూడా కట్టర్ ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది కనుక ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం. 


Related Post