పాక్ చెవికి అమెరికా హెచ్చరికలు ఎక్కవా?

August 26, 2017


img

ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిలయంగా మారిందని, కనీసం ఇప్పటికైనా ఉగ్రవాదులను ప్రోత్సహించడం మానుకోకపోతే కటిన చర్యలు తీసుకొంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అమెరికా రక్షణశాఖ పదేపదే గట్టిగా హెచ్చరిస్తున్నప్పటికీ దాని తీరులో ఎటువంటి మార్పు కనబడటం లేదు. పాక్ లో తయారవుతున్న ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించి పోలీసులు, భద్రతాదళాలపై దాడులు చేయడం నిత్యక్రుత్యమైపోయింది. 

పుల్వామా జిల్లాలో పోలీసులను, సి.ఆర్.పి.ఎఫ్.దళాలను లక్ష్యంగా చేసుకొని నిన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారి దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. సి.ఆర్.పి.ఎఫ్.దళాలు కూడా వారిపై ఎదురుదాడి చేయడంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. వారికోసం భద్రతాదళాలు గాలింపు మొదలుపెట్టాయి.

 జమ్మూ కాశ్మీర్ లో ఇటువంటి దాడులు, ప్రతిదాడులు వాటిలో మన సైనికులు గాయపడటమో లేక మృతి చెందడమో సర్వసాధారణమైన విషయం అయిపోయింది. భద్రతాదళాలు ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెడుతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వారిపై ఉగ్రవాదులు దాడులు చేస్తుండటం గమనిస్తే, నేటికీ పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారుచేస్తూనే ఉందని స్పష్టం అవుతోంది. 

ఈ కారణంగా పాకిస్తాన్ కు అమెరికా ఆర్ధిక సహాయం నిలిపివేసి గట్టిగా హెచ్చరిస్తుండటంతో ఇదే అదునుగా చైనా దానికి అండగా నిలబడుతోంది. రెండు దేశాలకు ఉమ్మడి శత్రువు భారత్ కనుక అది పాకిస్తాన్ కు అండగా నిలబడుతోంది. అందుకు బలమైన కారణమే కనబడుతోంది. 

ఆసియా ఖండంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారత్ నుంచే పోటీ ఎదుర్కోవలసివస్తోంది. కనుక పాక్ ఉగ్రవాదులు భారత్ ను అస్థిరపరుస్తున్నట్లయితే భారత్ తమను సవాల్ చేయలేదని చైనా కలలు కంటున్నట్లుంది. అందుకే అది పాకిస్తాన్ కు అండగా నిలబడి ప్రోత్సహిస్తోంది. 

అయితే గత 3-4 దశాబ్దాలుగా ఒకపక్క పాక్ ఉగ్రవాదులతో పోరాడుతూనే భారత్ స్థిరంగా అభివృద్ధి సాధిస్తున్న సంగతి చైనా, పాకిస్తాన్ దేశాలు గుర్తించినట్లు లేవు. అంతేకాదు..ఇప్పుడు మోడీ నాయకత్వంలో భారత్ లో చాలా దృడమైన ప్రభుత్వం ఏర్పడిందనే సంగతి కూడా గుర్తించినట్లు లేవు. డొక్లాంలో భారత్ సైనికులు చైనా సైనికులను నిలువరించడం చూస్తున్నప్పటికీ చైనాకు ఇంకా ఈ విషయం అర్ధమైనట్లు లేదు. అందుకే చైనా, పాక్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి.


Related Post