రేప్, హత్య కేసులలో ఆ బాబా దోషిగా నిర్ధారణ

August 25, 2017


img

పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో బలహీనవర్గాల ప్రజల చేత ‘నడిచే దేవుడు’గా పూజలు అందుకొంటున్న గుర్మీత్ రాం రహీం సింగ్ రేప్ మరియు హత్య కేసులలో దోషి అని సిబిఐ ప్రత్యేకకోర్టు ఈరోజు కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. 

“డేరా సచ్చా సౌధా” అనే ఆశ్రమం నడిపిస్తున్న గుర్మీత్ సింగ్ 2002లో హర్యానా లోని సిర్సా అనే ప్రాంతంలో గల డేరా ఆశ్రమంలో తనపై అత్యాచారం చేశాడని, ఆయన ఇంకా అనేక మంది మహిళలపై కూడా అత్యాచారాలు చేస్తున్నాడని కనుక ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక మహిళా భక్తురాలు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి లేఖ వ్రాసింది. 

సంచలనం సృష్టించిన ఆ లేఖను సుమోటుగా స్వీకరించిన పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవలసిందిగా సిబిఐను ఆదేశించింది. సిబిఐ  దర్యాప్తులో గుర్మీత్ బాబా చేతిలో అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళా భక్తులు ఆ విషయాన్ని కోర్టులో కూడా చెప్పారు. అయితే వారిలో ఒకామె మాత్రం తాను ఆ అత్యాచారం ద్వారా పునీతురాలినైనట్లు చెప్పడం విశేషం. 

సిబిఐ దర్యాప్తులో గుర్మీత్ హత్యలు, అత్యాచారాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో 2007, జూలై 30న సిబిఐ  అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హర్యానాలోని పంచకులలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సిబిఐ  కోర్టులో 2008 నుంచి విచారణ మొదలైంది. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్స్: 376 (రేప్), 506 (నేరపూరిత చర్యలు) క్రింద కేసులు నమోదు చేశారు. ఇన్నేళ్ళ తరువాత పంచకుల సిబిఐ  కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. త్వరలోనే శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. 

గతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పెద్దకోట వంటి అతని ఆశ్రమం లోపల, బయటా లక్షలాది మంది భక్తులు మానవ కవచంగా నిలిచి అడ్డుకొనే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో లోపల ఉన్న భక్తులు తుపాకులతో పోలీసులపై కాల్పులు జరిపారు. అప్పుడు సాయుధ దళాలు రంగప్రవేశం చేసి కోట గోడలు బ్రద్దలుకొట్టి అతనిని అరెస్ట్ చేయవలసి వచ్చింది. లోపల వారికి అనేక తుపాకులు, ప్రేలుడు సామాగ్రి లభించింది. 

గుర్మీత్ రాం రహీం సింగ్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆయన సాధువునని చెప్పుకొంటున్నప్పటికీ హర్జీట్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకొన్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 

అతను వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నీస్, క్రికెట్, వాటర్ పోలో వంటి అనేక క్రీడలు ఆడుతారని భక్తులు చెపుతారు. అతను స్వయంగా మూడు సినిమాలకు కధ, దర్శకత్వం, నిర్మాణం చేసి వాటిలో హీరోగా నటించారు కూడా. అతను మోటార్ సైకిల్స్, కార్లు, జీపులు, లారీలు వంటి వాహనాలు నడపడం సరదా. ఎప్పటికప్పుడు మారే ఆధునిక టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకొంటాడు. అతని చేతిలో అత్యాచారానికి గురైన మహిళా భక్తులు ఆయన ఆశ్రమంలో పెద్ద యాంఫి థియేటర్ ఉందని దానిలో ఆయన నీలి చిత్రాలు చూస్తుంటాడని కోర్టులో చెప్పారు. 

ఆయన మొత్తం 53 ప్రపంచ రికార్డులు సాధించారు. వాటిలో 17గిన్నిస్ రికార్డులు, 27 ఏసియా బుక్ రికార్డులు, ౭ ఇండియన్ బుక్ రికార్డులు, 2 లిమ్కా రికార్డులున్నాయి. బ్రిటన్ లోని వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ కూడా ప్రధానం చేసింది.  

ఇక డేరా సచ్చా సౌదా ఆశ్రమం తరపున అతను చేసే సేవా కార్యక్రమాలకు కూడా అంతు లేదు. డేరా భక్తులకు నామ మాత్రపు ధరలకు నాణ్యమైన ఆహారవస్తువులు అందిస్తాడు. తాను నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరుపేదలకు ప్రాణాంతక వ్యాధులకు సైతం ఉచిత చికిత్స అందిస్తాడు. రెండు రాష్ట్రాలలో నిరుపేదల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. అందుకే ఆయనకు రెండు రాష్ట్రాలలో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులున్నారు.

ఇంత విలక్షణమైన, ప్రతిభావంతుడైన, పరోపకార గుణం ఉన్న గుర్మీత్ రాం రహీం సింగ్ తన బలహీనతలను, మానసిక వికారాలను అదుపుచేసుకోలేకపోవడం వలననే ఇటువంటి నీచమైన పనులకు పాల్పడి చివరికి జైలు పాలయ్యాడు. లేకుంటే నిజంగానే అందరికీ ఆరాధ్యుడై ఉండేవాడేమో?



Related Post