రేపు తెరాస కీలక సమావేశం

August 25, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, మంత్రులు, నేతలతో శనివారం తెలంగాణా భవన్ లో సమావేశం కాబోతున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర సర్వే నిర్వహించి రెవెన్యూ రికార్డులలో అవకతవకలను సరిచేసి సమూల ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కనుక బారీ స్థాయిలో చేపట్టబోయే ఆ కార్యక్రమానికి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల పూర్తి సహకారం తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే రేపు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసిన సర్వేల ఆధారంగానే రికార్డులున్నాయి వాటి ఆధారంగానే నేటికీ లావాదేవీలు సాగుతున్నాయి. అయితే సమగ్ర సర్వే చేయించడం చాలా బారీ ఖర్చు, శ్రమతో కూడుకొన్న వ్యవహారం. పైగా భూవివాదాలు ఉండనే ఉంటాయి. కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో సర్వే చేయించడానికి సాహసం చేయదు. కానీ కేసీఆర్ అందుకు పూనుకొంటున్నారు. 

ఒకసారి సమగ్ర సర్వే చేయిస్తే భూరికార్డులలో అవకతవకలన్నీ తొలిగిపోయి అన్నీ ఒక పద్ధతిలోకి వస్తాయి. ప్రభుత్వభూములు ఎంత ఉన్నాయో, ప్రైవేట్ భూములు ఎంత ఉన్నాయో, మళ్ళీ వాటిలో వివాదాస్పద భూములెన్ని ఉన్నాయనే లెక్కలన్నీ బయటకు వస్తాయి. కనుక వాటి ప్రకారం ప్రభుత్వం తగిన చర్యలు, ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఈ సర్వే ఫలితాలన్నీ కంప్యూటరీకరించబడతాయి కనుక రికార్డులన్నీ పారదర్శకంగా మారుతాయి. అందరికీ అందుబాటులోకి వస్తాయి.

అయితే ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కనుక అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల సహకారం కూడా చాలా అవసరమే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే వారితో సమావేశం అవడం చాలా మంచి ఆలోచనే. ఇదేవిధంగా ప్రతిపక్ష పార్టీలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి వారి సహకారం కోరినట్లయితే ఈ భూసర్వే ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంటుంది.


Related Post