గొర్రెల పంపిణీ పధకం ప్రభుత్వం పరువు తీయబోతోందా?

August 24, 2017


img

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పధకంలో చాలా అవకతవకలు జరుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నా సంబంధిత శాఖ అధికారులు మేల్కొనకపోవడం విచిత్రం. మొదట్లో ఒకేసారి బారీ సంఖ్యలో గొర్రెలు లభించకపోవడంతో అధికారులు జబ్బుపడిన గొర్రెలను కొనితీసుకురావడం వలన చాలా గొర్రెలు చనిపోతునట్లు వార్తలు వచ్చాయి. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఖండించారు. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

ప్రభుత్వం అందిస్తున్న గొర్రెలను వాటి యజమానులు డబ్బుకు ఆశపడి దళారులకు తక్కువ ధరకు అమ్ముకొంటుంటే, వారు వాటిని ఆంధ్రా, చుట్టుపక్కల రాష్ట్రాలకు తరలించి మళ్ళీ వాటినే తెలంగాణా అధికారులకు ఒక్కో యూనిట్ రూ.1.25 లక్షలకు అమ్ముతున్నారని సమాచారం. 

మహబూబాబాద్ జిల్లాలో మహమూద్ పట్టణం నుంచి 60 గొర్రెలను లారీలలో పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కాపు కాసి ఆ గొర్రెల లారీని పట్టుకొన్నారు. డ్రైవరును విచారించగా మహమూద్ పట్టణంలో ఆ గొర్రెలను పొందిన తొగరి నవీన్, ఐలయ్య, యాకబోయిన వెంకన్నలు వాటిని విక్రయించినట్లు తెలిపారు. 

ఒక్కో యూనిట్ (21 గొర్రెలను) రూ.70 వేల చొప్పున మూడు యూనిట్లను రూ.2.1 లక్షలకు అమ్మినట్లు వారు తెలిపారు. ఈవిధంగా రూ.70 నుంచి 80 వేలకు గొర్రెలను కొని వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించి మళ్ళీ వాటినే రూ.1.25 లక్షల చొప్పున తెలంగాణా అధికారులకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, కొండపాక్ తదితర ప్రాంతాలలో దళారులు గొర్రెలను కొనుచేయడానికి తిరుగుతున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి గొల్లకురుమలకు శాస్విత జీవనోపాధి కల్పించేందుకు ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం వలన రాష్ట్రంలో గొల్లకురుమల జీవన ప్రమాణాలు మెరుగుపడి, రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో ముందంజ వేస్తుందని, తద్వారా తెరాస ప్రభుత్వానికి ఇంకా గొప్ప పేరుప్రతిష్టలు వస్తాయని ఆయన ఆశించారు. కానీ ఈ పధకం అమలులో ఎదురవుతున్న ఊహించని సమస్యలు, లోటుపాట్లు, ఇటువంటి అక్రమాలు వంటివి ఆ లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే దాని ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవడమే కాకుండా చివరికి అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. 


Related Post