ఆ సమావేశంలో బలప్రదర్శనలు ఎందుకు?

August 24, 2017


img

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన సామాజిక, పర్యావరణ ప్రభావాలపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు పెద్దపల్లి, కామారెడ్డి జిల్లా కేంద్రం, సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ లో అధికారులు వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల ప్రధానోద్దేశ్యం ఆ ప్రాజెక్టు వలన ఆ ప్రాంతాలలో రైతులకు ఎంత నష్టం జరుగుతుంది? రైతులు ఎటువంటి ప్యాకేజీ కోరుకొంటున్నారు? ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణంపై..నిర్వాసిత రైతులపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? వంటి విరాలను సేకరించడం. అయితే ఈ సమావేశాలు కాంగ్రెస్, తెరాసల బలప్రదర్శనలకు వేదికగా మారడం శోచనీయం. 

పెద్దపల్లిలో సమావేశం మొదలుకాగానే దానిలో పాల్గొన్న తెరాస నేతలు ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రైతులు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ తమ భూములకు సరైన నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని అధికారులను కోరారు. ఆ సమావేశానికి కాంగ్రెస్ తరపున డి.శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ఆయన అనుచరులు “రైతులను ముంచేస్తున్న సిఎం కేసీఆర్ డౌన్ డౌన్” అని పెద్దగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ మొదలై ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకొనే వరకు వెళ్ళింది. అప్పుడు పోలీసులు వచ్చి కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి తరలించవలసి వచ్చింది.

మిగిలిన చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత దూకుడుగా ప్రవర్తించకపోవడంతో సమావేశాలు సజావుగా సాగాయి. కానీ అన్ని చోట్ల నిర్వాసిత రైతులు తమకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించిన తరువాతే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని గట్టిగా పట్టుబట్టారు. అది న్యాయమైన కోరికే కనుక జిల్లా కలెక్టర్లు, అధికారులు వారికి హామీ ఇచ్చారు.

అధికారులు, రైతులు మాత్రమే సమావేశమయ్యి ఈ సమస్యలపై చర్చించుకొని సామరశ్యంగా పరిష్కరించుకోవలసి ఉండగా తెరాస నేతలు, కార్యకర్తలు దానిలో పాల్గొని రైతులపై ఒత్తిడి తేవడం సరికాదనే చెప్పాలి. ఈ సమావేశాలలో తెరాస నేతలు పాల్గొంటున్నారు కనుక సహజంగానే కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఇరువర్గాలు రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడకుండా తమ తమ పార్టీల వైఖరికి, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడటం, చివరికి కొట్టుకోవడం శోచనీయం. 


Related Post