నేరెళ్ళ ఘటనపై రాష్ట్రపతి స్పందిస్తారా?

August 24, 2017


img

అఖిలపక్ష నేతలు బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి నేరెళ్ళ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని పిర్యాదు చేసారు. అక్రమ ఇసుకరవాణాను అడ్డుకొన్న దళితులను లారీలతో త్రొక్కించి చంపివేస్తుంటే వారు ప్రతిఘటించినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు రాష్ట్రపతికి పిర్యాదు చేశారు. దళితులపై దాడి జరిగితే ఇంతవరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయలేదని పిర్యాదు చేశారు. ఈ ఘటనలపై కేంద్రహోంశాఖ ద్వారా వివరాలు తెప్పించుకొని బాధితులకు న్యాయం చేయాలని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని అఖిలపక్ష నేతలు మీడియాకు తెలియజేశారు. 

రాష్ట్రపతిని కలిసినవారిలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సిపిఐ రాజ్యసభ ఎంపీ డి. రాజా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తదితరులున్నారు. 

రాష్ట్రపతి రాంనాథ్ దీనిపై ఏవిధంగా స్పందిస్తారో ఊహించడమ కష్టం. ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా ఎన్నికవడానికి మొట్టమొదట మద్దతు పలికింది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు కేసీఆర్ అపూర్వమైన ఘనస్వాగతం పలికారు. అందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. కనుక అఖిలపక్ష నేతలు ఇచ్చిన ఈ పిర్యాదుపై ఆయన చర్యలు తీసుకోమని కేంద్రాన్ని ఆదేశిస్తారో లేదో చెప్పలేము.  

కానీ ఆయన కూడా దళితుడే. ఆయన స్వయంగా తన జీవితంలో ఇటువంటి చేదు అనుభవాలను అనేకం ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు   కనుక దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు, సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఆయనకు బాగా తెలుసు. కనుక ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకొన్నా ఆశ్చర్యం లేదు.

తెలంగాణాలో తెరాసను గట్టిగా డ్డీకొని వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని భాజపా కూడా కలలు కంటోంది. కనుక ఒకవేళ రాష్ట్రపతి కోరినట్లయితే కేంద్రప్రభుత్వం కూడా జోక్యం చేసుకొనే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే తెరాస సర్కార్ కు కొత్త ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టు, మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్టీ కమీషన్ తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. 


Related Post