అయ్యో రైతన్న..ఎంత కష్టం వచ్చిందే నీకు?

August 23, 2017


img

తెలంగాణాలో వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి చేస్తున్న కృషికి జాతీయ ఆహార మరియు వ్యవసాయ కౌన్సిల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మూడు రంగాల అభివృద్ధి కోసం తీవ్రకృషి చేస్తున్న మాట కూడా వాస్తవం. అయితే నేటికీ తెలంగాణాలో రైతన్నల పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదని నిరూపిస్తున్నట్లుగా ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో మంగళవారంనాడు ఒకే రోజున నలుగురు రైతులు ఆర్ధిక సమస్యలను భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు. 

వారిలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దవారిగూడెంకు చెందిన డేగల బాబయ్య (60) బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా, నల్లగొండ జిల్లా చండూరు మండలంలో దోనిపాముల గ్రామానికి చెందిన వలిజాల రాములు (62) తన పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామానికి చెందిన రూప రెడ్డి ప్రదీప్ రెడ్డి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి పరిధిలో దూస్ గాం గ్రామానికి చెందిన నడ్సి గంగారం (62) తన పొలం వద్ద కరెంటు స్తంభానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

ఈ నలుగురు రైతులు 2 నుంచి 6 ఎకరాల వరకు పొలాలున్నవారే. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడున్నారు. వారిలో నడ్సి గంగారం తప్ప మిగిలిన ముగ్గురూ పంటలు వేసి అవి పండక, పండిన వాటికి గిట్టుబాటు ధరలు రాక అప్పులపాలై వాటిని తీర్చే దారి కనబడకపోవడంతో అప్పులిచ్చినవారి ఒత్తిళ్ళను భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు. 

నడ్సి గంగారం పరిస్థితి ఇంకా దారుణం. అయన పొలంలో వేసిన మూడు బోర్లు ఎండిపోవడంతో కొన్ని రోజుల క్రితమే మరో బోరు త్రవ్వించాడు కానీ దానిలో కూడా చుక్క నీరు పడకపోవడంతో తీవ్ర నిరాశానిస్ప్రుహాలకు లోనై ఆత్మహత్య చేసుకొన్నాడు. 

వ్యవసాయాన్ని పండుగగా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెపుతుంటారు. దాని కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుచేస్తూనే రైతన్నలు ఈవిధంగా అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడేందుకు ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. 

చివరిగా ఒక్కమాట బోరుబావులకు పసిపిల్లలేకాకుండా రైతన్నలు కూడా బలైపోతున్నారు. కనుక బోరుబావుల త్రవ్వకం విషయంలో ప్రభుత్వం కటినమైన నియమనిబంధనలు రూపొందిస్తే బాగుంటుంది. డబ్బు కోసం ఆశపడి విచ్చలవిడిగా బోరుబావులు త్రవ్వేస్తున్న బోర్ వెల్ కంపెనీలను కూడా కట్టడి చేసినట్లయితే, ఇటువంటి అనేక సమస్యలను నివారించవచ్చు కదా.


Related Post