త్వరలో రూ.200 నోట్లు మార్కెట్లలోకి

August 23, 2017


img

పాతనోట్ల రద్దు తరువాత అంతకంటే పెద్దదైన రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టి సంచలనం సృష్టించిన రిజర్వ్ బ్యాంక్, త్వరలో రూ.200 నోట్లను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించి అందరినీ మళ్ళీ ఆశ్చర్యపరిచింది. ఆ కొత్త రూ.200 నోట్లు ఆగస్ట్ నెలాఖరులోగా లేదా సెప్టెంబర్ మొదటివారంలోగా బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్దికమంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. గత 4-5 నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ముద్రణాలయాలలో వాటిని ముద్రిస్తోంది. బహుశః ఆ నోట్ల ముద్రణ పని పూర్తయినందున ఈరోజు ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.

సామాన్య ప్రజలు రోజువారీ ఆర్ధిక లావాదేవీలకు చిన్న నోట్లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నందున ఈ నోట్లను ముద్రిస్తున్నట్లు ఆర్ధికశాఖ చెపుతోంది. అయితే ఏదో ఒకరోజున మళ్ళీ హటాత్తుగా రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు రూ.500  అన్నిటికంటే పెద్ద నోటు అవుతుంది కనుక అప్పుడు దేశంలో మళ్ళీ నగదు కొరత ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతోనే రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల ముద్రణకు పూనుకొని ఉండవచ్చు. బహుశః అందుకే అప్పటి నుంచి మళ్ళీ కొత్తగా రూ.2,000 నోట్లను ముద్రించడం లేదేమో?

అయితే రిజర్వ్ బ్యాంక్ ఈ ఊహాగానాలను కొట్టివేస్తోంది. రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచన లేదని చెపుతోంది. కానీ అటువంటి ప్రతిపాదనలు ఉన్నట్లయితే ఆ విషయం రిజర్వ్ బ్యాంక్ కైనా ఇంత ముందుగా తెలుస్తుందని ఆశించడం అవివేకమే అవుతుంది. బహుశః వచ్చే సార్వత్రిక ఎన్నికలకు 2-3 నెలల ముందు రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారేమో? 


Related Post