తెరాస సర్కార్ కు మరో నోటీస్?

August 23, 2017


img

నేరెళ్ళ ఘటనలో సిరిసిల్ల పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా తెరాస సర్కార్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, దళిత సంఘాల ఆగ్రహం, మరోపక్క హైకోర్టు, మానవహక్కుల కమీషన్ నుంచి నోటీసులు అందుకొంటూ అందరికీ జవాబు చెప్పుకోలేక చాలా ఇబ్బందిపడుతోంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు తెరాస తరపున ఎవరూ వెంటనే స్పందించకపోవడం చేత కూడా ఈ సమస్య తీవ్రత పెరిగిందని చెప్పకతప్పదు.

“దళితుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు ఉంది కనుకనే ఇంత జరిగినా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ భాదితులను పట్టించుకోలేదు...ఈ ఘటనపై స్పందించలేదు,” అని ప్రతిపక్షాలు ఆరోపించడంతో మంత్రి కేటిఆర్ హడావుడిగా బాధితులను పరామర్శించి వచ్చారు. అయినప్పటికీ ఈ ఘటనపై వేడి తగ్గలేదు. ప్రతిపక్షాల విమర్శలు ఆగలేదు. కోర్టులు, హక్కుల సంఘాల్ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. 

తాజాగా జాతీయ దళితహక్కుల కమీషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, డిజిపి అనురాగ్ శర్మను నేరెళ్ళ ఘటనలపై సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపినట్లు సమాచారం.

“మా ప్రజలను మేమే ఎందుకు బాధించాలని కోరుకొంటాము?” అని మంత్రి కేటిఆర్ అన్న మాట వాస్తవమే కావచ్చు. కానీ ఈ ఘటనలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తోంది. అపనిందలు భరించవలసి వస్తోంది. వరుసగా ఇన్ని కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఇకనైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడం మంచిది. 


Related Post