నంద్యాల సీటు ఎవరికీ దక్కుతుందో?

August 23, 2017


img

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నంద్యాల శాసనసభ సీటును భర్తీ చేయడానికి ఈరోజు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. 

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఉపఎన్నికలను అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికల స్థాయిలో ఆ రెండు పార్టీలు చాలా ఉదృతంగా ప్రచారం చేశాయి. 

నిజానికి సార్వత్రిక ఎన్నికలకు కేవలం 20 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఒకవేళ కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్దపడినట్లయితే 14 నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉంటుంది. అయినా ఈ ఉపఎన్నికలను రెండు పార్టీలు ‘సెమీ ఫైనల్స్’ గా భావించడంతో హోరాహోరీగా ప్రచారం చేశాయి. 

నంద్యాలలో భూమా, శిల్పా వర్గాల మద్య చిరకాలంగా ఆధిపత్యపోరు జరుగుతోంది కనుక ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తామని మంత్రి అఖిలప్రియ, వైకాపా అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి సవాళ్లు విసురుకోవడం చేత ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

రాష్ట్ర ప్రజలందరూ తమ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికలలో వైకాపాయే గెలువబోతోందని, అప్పుడు తానే ఏపికి ముఖ్యమంత్రి కాబోతున్నానని పదేపదే నొక్కి చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, దానిని నిరూపించుకోవడానికి  చాలా కాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు. కనుక ఈ ఉపఎన్నికలలో తన అభ్యర్ధిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. 

అయితే జగన్ కు అంత సీన్ లేదని నిరూపించేందుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉపఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొన్నారు. “గెలుస్తామనుకోవడం వేరు..గెలవడం వేరు” అని చంద్రబాబు అన్నారు. 

ఈ ఉపఎన్నికలకు ఇంత బారీ స్థాయిలో ఇరుపార్టీలు ప్రచారం చేసుకోవడం వలన వీటిలో ఎవరు ఓడినా ఆ పార్టీకి తీరని అప్రదిష్ట అని చెప్పక తప్పదు. 

తెదేపా తరపున స్వర్గీయ భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి, వైకాపా తరపున మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరపున అబ్దుల్‌ ఖాదర్‌ పోటీ చేస్తున్నారు. మొత్తం 15 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఈ నెల 28న వెలువడతాయి. మరి నంద్యాల సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.


Related Post