ఎస్.పి.ని ప్రభుత్వం అలాగ బదిలీ చేసిందా?

August 22, 2017


img

నేరెళ్ళ ఘటనకు సిరిసిల్ల సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్ ను బదిలీ చేసినప్పటికీ ప్రతిపక్షాలు జిల్లా ఎస్పి విశ్వజిత్ ను కూడా బదిలీ చేయాలని పట్టుబడుతున్నాయి. అతని ఆదేశాల మేరకే ఎస్.ఐ. రవీందర్ పోలీసులతో దళితులపై దాడులు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఎస్పిని బదిలీ చేస్తే వాటి దృష్టిలో ప్రభుత్వం ఇంకా చులకన అవుతుంది కనుక ఏటా లడ్డాక్ లో జరిగే స్వింగ్ ట్రాక్ శిక్షణా కార్యక్రమానికి ఈసారి విశ్వజిత్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శిక్షణా కార్యక్రమం ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను వేరే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడం ద్వారా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఆ వార్తలను అటు పోలీస్ ఉన్నతాధికారులు, ఇటు విశ్వజిత్ ఖండిస్తున్నారు. ఏటా జరిగే ఆ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీస్ అధికారులను పంపడం ఆనవాయితీ కనుక ఈసారి విశ్వజిత్, రిజర్వ్ విభాగానికి చెందిన డి.ఎస్.పి.రమణారెడ్డిలను పంపిస్తున్నామని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతున్న విశ్వజిత్ తన బాధ్యతలను కరీంనగర్ ఎస్.పి. కమలహాసన్ రెడ్డికి అప్పగించారు. ఆయన సిరిసిల్ల జిల్లా ఇన్-ఛార్జ్ ఎస్.పి.గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. విశ్వజిత్ తన శిక్షణ ముగించుకొని వచ్చిన తరువాత ఆయనకు మళ్ళీ సిరిసిల్లలోనే పోస్టింగ్ ఇస్తుందా లేక వేరే జిల్లాలో పోస్టింగ్ ఇస్తుందా చూడాలి. దానిని బట్టి అవి గాలి వార్తలా కాదా అనేది నిర్ధారణ అవుతుంది. 


Related Post