దేశంలో 6 నెలలు ట్రిపుల్ తలాక్ నిషేధం!

August 22, 2017


img

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. నేటి నుంచి 6 నెలల పాటు దేశమంతటా ట్రిపుల్ తలాక్ ను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. 

ట్రిపుల్ తలాక్ వలన ముస్లిం మహిళల ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతోందని, దాని వలన అనేక మంది మహిళలు, చిన్నారుల జీవితాలు చిద్రం అవుతున్నాయని, కనుక దానిని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. దానిలో జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ సభ్యులుగా ఉన్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం, ముస్లిం పర్సనల్ లా బోర్డు, మరికొందరు చేసిన సుదీర్గ వాదనలను విన్న తరువాత ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈరోజు తన తుది తీర్పు వెలువరించింది. 

ఐదుగురు న్యాయమూర్తులలో ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ట్రిపుల్‌ తలాక్ ను సమర్ధించగా, మిగిలినవారు వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

నేటి నుంచి 6 నెలల పాటు దేశమంతటా ట్రిపుల్ తలాక్ ను నిషేదిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ ఆరు నెలలలోగా కేంద్రప్రభుత్వం దీనికోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి చట్టాన్ని తయారుచేయాలని, ఒకవేళ అలా చేయకుంటే దేశంలో మళ్ళీ యధాప్రకారం ట్రిపుల్ తలాక్ అమలులోకి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కనుక నేటి నుంచి ఆరు నెలల వరకు ముస్లిం పురుషులు ఎవరూ తమ భార్యలకు ఈ పద్దతిలో తలాక్ ఇవ్వడానికి వీలులేదు. ఒకవేళ తప్పనిసరి అనుకొంటే కోర్టును ఆశ్రయించి దాని ద్వారానే విడాకులు తీసుకోవలసి ఉంటుంది. 

ఇది ఇస్లాం మతంతో..ముస్లిం ప్రజల ఆచార వ్యవహారాలతో...వారి మనోభావాలతో ముడిపడుతున్న చాలా సున్నితమైన అంశం కనుక రాజకీయ పార్టీలన్నీ చాలా ఆచితూచి స్పందించవలసి ఉంటుంది. దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తుంటాయి. కనుక సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇస్తే రాజకీయంగా తమకు మేలు కలుగుతుందా లేక నష్టపోతామా అనే లెక్కలు కట్టుకొన్న తరువాతనే ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ఏర్పాటుకు అవి సహకరించాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. బహుశః త్వరలోనే అన్ని పార్టీలు దీనిపై పార్టీలో మేధోమధనం చేసి తమ తమ వైఖరిని ప్రకటించవచ్చు. 

అయితే రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ఈ ట్రిపుల్ తలాక్ వలన అనాధలుగా మారి దయనీయమైన జీవితాలు గడుపుతున్న వేలాదిమంది ముస్లిం మహిళల పరిస్థితులను, వారిపైనే ఆధారపడున్న వారి పిల్లల పరిస్థితులు, వారి భవిష్యత్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. అన్నిటి కంటే ముఖ్యంగా దీనిపై ముస్లిం మహిళల అభిప్రాయలు తీసుకోవడం చాలా మంచిది. 


Related Post