మా నెత్తిపై వాళ్ళు జోకర్ టోపీ పెట్టారు: కమల్ హాసన్

August 22, 2017


img

తమిళనాడు అన్నాడిఎంకెలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు నిన్న మళ్ళీ చేతులు కలిపి అధికారం పంచుకోవడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ చాలా తీవ్రంగా స్పందించారు. “ఇంతవరకు గాంధీ టోపీ, ఖద్దరు టోపీ..కాశ్మీరీ టోపీలను చూశాము. ఇప్పుడు తమిళుల నెత్తిమీద జోకర్ టోపీ పెట్టారు. ఇది చాలా ఇంకా ఏమైనా కావాలా? ఓ తమిళుడా..ఇకనైనా మేలుకో,” అని ట్వీట్ చేశారు. 

అసలు తమిళనాడులో ప్రజలు, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ఏమి కోరుకొంటున్నారనే విషయంపై స్పష్టత లేదు. వారు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఎవరిని కోరుకొంటున్నారు? ఇద్దరూ చేతులు కలపడం వారికి ఆమోదమా కాదా? కాకపోతే ఎందుకు? శశికళ గురించి వారి అభిప్రాయం ఏమిటి?వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అయితే రాష్ట్రంలో ఈ రాజకీయ అనిశ్చిత తొలగిపోవాలని కోరుకొంటున్నారనేది స్పష్టంగానే కనబడుతోంది. 

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె. దాని వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందిస్తూ “కేంద్రం డైరెక్షన్ లోనే ఈ డ్రామా అంతా జరిగింది. దాని సూచనల మేరకే పన్నీర్, పళని వర్గాలు చేతులు కలిపాయి,” అని ఆరోపించారు. వారి కలయిక వలన డిఎంకె పార్టీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది కనుక ఆయన ఆందోళన చెందడం విమర్శించడం సహజమే. కానీ రాజకీయాలలో లేని కమల్ హాసన్ ఎందుకు కోపగించుకొంటున్నారో తెలియదు. 

కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రారు. రావడానికి సిద్దపడుతున్న తన సహనటుడు రజనీకాంత్ ను విమర్శిస్తుంటారు. అసలు కమల్ హాసన్ ఏమి జరగాలని కోరుకొంటున్నారో ధైర్యం చెప్పరు కానీ తమిళులను మేలుకోమంటారు. మేల్కొని ఏమి చేయాలో చెప్పరు. 

కొసమెరుపు ఏమిటంటే, శశికళ మేనల్లుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారుట! తన వెంట 25 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు ఉన్నారని వాదిస్తున్నారు. కనుక ఈరోజు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి పళని, పన్నీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరబోతున్నారుట! 


Related Post