ఇవి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలా..హవ్వ!

August 22, 2017


img

ఇటీవల ఎస్.బి.ఐ. అనుబంద బ్యాంకులను విలీనం చేస్తూ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణ ఇదని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గొప్పగా చెప్పుకొన్నారు. దీని వలన బ్యాంకు ఆర్ధికవ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని చెప్పారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకుల సమ్మె దాని వెనుక అసలు కారణాన్ని, దాని పర్యవసానాలను కూడా బయటపెట్టింది.

బడా కార్పోరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని ఉద్దేశ్యపూర్వకంగానే ఎగవేస్తున్నారు. దాని వలన గత ఐదేళ్ళ వ్యవధిలోననే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్లు మొండి బకాయిలు పేరుకొనిపోవడంతో వాటిని బ్యాంకులు రద్దు చేయవలసి వచ్చింది. 

ఆ మొండి బకాయిలను వసూలు చేసుకొనే ప్రయత్నం చేయకుండా నష్టాలను కప్పిపుచ్చుకొనేందుకు సంస్కరణల పేరిట బ్యాంకుల విలీనం చేసింది. తద్వారా బ్యాంకులను పటిష్టం చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ ఒక తీవ్ర సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఇటువంటి తాత్కాలిక ఉపాయాలను అమలుచేయడం వలన సమస్యను తాత్కాలికంగా వాయిదా వేయగలదు తప్ప మళ్ళీ అటువంటి ఆర్దికనేరాలు పునరావృతం కాకుండా ఆపలేదు. పైగా ఇంకా అనేక కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయని ఈరోజు సమ్మె స్పష్టం చేస్తోంది. ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నిస్తే వారు గట్టిగా ప్రతిఘటించడం ఖాయం అని స్పష్టం అవుతోంది. 

కొందరు ఆర్దిక నేరగాళ్ళు చేస్తున్న పాపాలకు బ్యాంకులను, వాటి ఉద్యోగులను, చివరకి సామాన్య ప్రజలను బాధ్యులను చేయడం అవివేకమే. రాజకీయ పార్టీలకు, ఆర్ధిక నేరగాళ్ళకు మద్య ఉన్న కనబడని అవినాభావ సంబంధాలే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. అధికార పార్టీలకు అవసరమైన నిధులను ఆర్ధిక నేరగాళ్ళు సమకూరుస్తుంటే, వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే అవుతుంది. 

దేశంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, నల్లధనం వంటి అవకరాలను తొలగించడానికి నోట్లరద్దు, నగదు రహిత లావాదేవీలు, జి.ఎస్.టి. వంటి శస్త్ర చికిత్సలు అనివార్యమని చెపుతూ మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఏమి ప్రయోజనం? అని ప్రశ్నిస్తున్న లక్షలాది బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం సమాధానం చెప్పగలదా? ఆర్దికనేరగాళ్ళను పట్టుకొని మొండి బకాయిలను వసూలు చేయకుండా బ్యాంకుల విలీనం ఉద్యోగుల తగ్గింపు, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలు తీసుకొంటుంటే చివరికి ఏదో ఒకరోజు దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.


Related Post