ఇంకా ఎన్నేళ్ళు గత ప్రభుత్వాలను నిందిస్తారో?

August 21, 2017


img

తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేక సమస్యలు ఉండేవి. వాటి కారణంగా అది తీవ్ర ఒత్తిడికి గురవుతుండేది. కనుక ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వాలను నిందించేవారు. అవి కొంతవరకు నిజమే కనుక ప్రజలు కూడా అర్ధం చేసుకొని ప్రభుత్వానికి సహకరించారు. అప్పటి నుంచి తెరాస సర్కార్ ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకొంటూవస్తోంది. నేటికీ అనేక సమస్యలున్న మాట వాస్తవమే. వాటిని కూడా తెరాస సర్కార్ పరిష్కరిస్తూనే ఉంది. అందుకు దానిని అభినందించవలసిందే. 

మంత్రి కేటిఆర్ సోమవారం బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన తరువాత జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈ మూడేళ్ళలో తమ ప్రభుత్వం చేసిన, ఇక ముందు చేయనున్న అభివృద్ధి పనులను ఏకరువు పెట్టిన తరువాత యధాప్రకారం గత ప్రభుత్వాలను నిందించారు. "60 ఏళ్ళగా హైదరాబాద్ నగరానికి పట్టిన దరిద్రం ఒక్కరోజులో పోతుందా? మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏమైనా ఉందా? చూ మంతర్ అని సమస్యలను మాయం చేసేయడానికి?" అని ప్రశ్నించారు.                 

కేటిఆర్ చెప్పింది అక్షరాల నిజమే కావచ్చు అయితే హైదరాబాద్ నగరం కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడటం సరికాదు. నిజానికి గత ఆరు దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సమైక్యరాష్ట్రంలో అన్ని జిల్లాలను విస్మరించి కేవలం హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకొంటూపోయాయనే సంగతి అందరికీ తెలుసు.

అలాగే చంద్రబాబు నాయుడుని ఏవిషయంలోనైనా నిందించవచ్చు కానీ హైదరాబాద్ ను ఐటి కేంద్రంగా మార్చిన ఘనత ఆయనదే అని చెప్పకతప్పదు. ఇప్పుడే అదే తెలంగాణా రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తోందనే సంగతి అందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణాలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కనుకనే నేడు తెరాస సర్కార్ వాటిని వినియోగించుకొని ముందుకు సాగగలుగుతోందనే సంగతి అందరికీ తెలుసు. కనుక కేవలం తెరాస మాత్రమే రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదనే వాదన, విమర్శలు సరికావని చెప్పకతప్పదు. 

గత ప్రభుత్వాలకంటే తెరాస సమర్ధంగా పనిచేస్తుంది.. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది..ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనే నమ్మకంతోనే ప్రజలు తెరాసకు అధికారం కట్టబెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు అది గట్టి ప్రయత్నాలే చేస్తోంది కూడా. అయితే ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని లోపాలుంటాయి. కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.

తెరాస సర్కార్ కూడా అందుకు మినహాయింపు కాదని ప్రతిపక్షాల, ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శలు, ఆరోపణలు నిరూపిస్తున్నాయి. కనుక గత ప్రభుత్వాలను నిందిస్తూ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నించడం కంటే, ప్రజలు తమపై ఉంచిన  నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుపోతే, రాష్ట్రానికి ఎవరి వలన మేలు కలుగుతుందో ఎవరి వలన నష్టం కలుగుతుందో ప్రజలే నిర్ణయించుకొంటారు కదా! 


Related Post