హమ్మయ్య మరో ఎపిసోడ్ ముగిసింది..తరువాత?

August 21, 2017


img

తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో గత 6 నెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఈరోజు తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాల మద్య జరుగుతున్న చర్చలు ఫలించి, రాజీ కుదరడంతో రెండు వర్గాలు ఈరోజు విలీనం అయ్యాయి. 

అనంతరం పన్నీర్ సెల్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు కీలకమైన ఆర్ధికమంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ కూడా అప్పగించబడ్డాయి. ఆయన ముఖ్య అనుచరుడు పాండ్య రాజన్ కు తమిళ బాషాభివృద్ధి శాఖ మంత్రి పదవి లభించింది. త్వరలోనే పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తానని పళనిస్వామి హామి ఇచ్చారు. 

ఈ కధ ఇంతటితో ముగిసినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఈ తమిళ సస్పెన్స్ సీరియల్ లో మరో ఎపిసోడ్ పూర్తయిందని మాత్రమే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే, అన్నాడిఎంకెలో 10-15మందికి పైగా ఎమ్మెల్యేలు శశికళ మద్దతుదారులున్నారు. ఒకవేళవారు పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. కనుక ఈ సంక్షోభం పూర్తిగా ముగిసినట్లు భావించలేము. 


Related Post