దానిని కూడా వాడేసుకొంటున్నారు!

August 21, 2017


img

శ్రావణమాసం వచ్చిందంటే మహిళలు బంగారు ఆభరణాలు కొనడానికి హడావుడి పడినట్లే, సెప్టెంబర్ నెల వస్తోందంటే రాష్ట్రంలో భాజపా నేతల హడావుడి కూడా మొదలైపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లీస్ నేతలకు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపడం లేదని కనుక తామే ఘనంగా జరుపుతామని ప్రకటనలు గుప్పిస్తుంటారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని హామీలు కూడా ఇస్తుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి పార్టీ జాతీయనేతలను రప్పిస్తుంటారు. ఆ సభలో అందరూ కలిసి తెరాస సర్కార్ ను విమర్శల వర్షం కురిపించడం ఈ తంతు పూర్తయిపోతుంది. మళ్ళీ తరువాత ఏడాది సెప్టెంబర్ నెల వచ్చే వరకు తెలంగాణా విమోచన దినోత్సవం ఊసే ఉండదు. భాజపా ఆరోపిస్తున్నట్లు మజ్లీస్ పార్టీతో సఖ్యతను, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని తెరాస సర్కార్ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరుపడం లేదనుకొంటే, విమోచన దినోత్సవం పేరు చెప్పుకొని తెలంగాణా ప్రజలను ఆకర్షించాలని భాజపా ప్రయత్నిస్తుంటుంది. అంటే రెండు పార్టీలు కూడా దీనిని రాజకీయంగా వాడుకొంటున్నాయని స్పష్టం అవుతోంది. 


Related Post