హన్మంతన్న చించేశాడు..మంచిదే!

August 21, 2017


img

సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మళ్ళీ హడావుడి చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యి తనకారులో ఇంటికి తిరిగి వెళుతుండగా దారిలో ఆర్టీసి బస్సుపై అతికించిన అభ్యంతరకరమైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ ను చూసి, కారులో నుంచి దిగి బస్సును ఆపించి స్వయంగా ఆ పోస్టర్ చించివేశారు. ఆ పోస్టర్ లో హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని ముద్దుపెట్టుకొంటున్న చిత్రం ఉంది. డబ్బు కోసం కక్కుర్తిపడి ఆర్టీసి మరీ ఇంత నీచానికి దిగజారిపోవాలా? అని ప్రశ్నించారు. అటువంటి అభ్యంతరకరమైన పోస్టర్ల వలన యువత చెడుమార్గం పట్టే ప్రమాదం ఉందని హనుమంతరావు అన్నారు. 

ఆ పోస్టర్ చాలా అభ్యంతరకరం ఉన్నమాట వాస్తవం. ఆర్టీసి అధికారులు ఆదాయం కోసం ఆశపడి అటువంటి వాటిని తమ బస్సులపై అంటించడం తప్పే. అయితే ఆ పోస్టర్ ను చించినంత మాత్రాన్న ఆ సినిమాలో ఆ అభ్యంతరకర దృశ్యాలు ఉండకుండాపోవు కదా? కనుక సినిమాలలో అటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించడం కూడా చాలా అవసరమే.  

ఈరోజుల్లో సినిమాలలో మితిమీరిన హింస, రక్తపాతం, ముద్దుసీన్లు, అశ్లీల నృత్యాలు, అసభ్యకర సన్నివేశాలు, ద్వందార్ధాల డైలాగులు సర్వసాధారణమైపోయాయి. ఇక బాలీవుడ్ లో అయితే హీరోయిన్ల నగ్నసన్నివేశాలు కనిపిస్తున్నాయి. నటన, కళ పేరిట బూతును ప్రదర్శిస్తూ యువతను కూడా అదే మార్గంలో పయనింపజేస్తోంది మన సినీ పరిశ్రమ. ఆ కారణంగానే ఇప్పుడు యువతీయువకులు బూతులు మాట్లాడుకోవడం, బహిరంగంగా కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం తప్పు కాదనే అభిప్రాయం ఏర్పరచుకొన్నారు. చివరికి మన బాష, యాసపై కూడా సినిమాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

అయితే ఇటువంటి వాటిని తప్పుపట్టిన వారినే అందరూ తప్పుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ విశ్రుంకలత్వం చివరికి దేనికి దారి తీస్తుందో గ్రహించడం లేదు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మహిళలు, చివరికి పసిపిల్లలపై అత్యాచారాలు, ఆ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. శక్తివంతమైన సినీ మాధ్యమంలో మంచికంటే చెడు ఎక్కువగా చాలా మందిని ఆకర్షిస్తుంది. ఆ ప్రభావం యువత మాటతీరు, ఆలోచనా తీరును, చివరికి వారి ప్రవర్తనను కూడా మార్చివేస్తూ సామాజిక విద్వంసానికి దారితీస్తోంది. కనుక కళ, నటన పేరిట సినిమాలలో ప్రదర్శించబడుతున్న ఈ విశ్రుంకలత్వానికి అడ్డుకట్టవేయడం చాలా అవసరమే. 


Related Post