గోరక్ పూర్ ఆసుపత్రేమీ పిక్నిక్ స్పాట్ కాదు: యోగి

August 19, 2017


img

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం గోరక్ పూర్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, ఆ ఆసుపత్రిలో చనిపోయిన పిల్లల తల్లితండ్రులను పరామర్శించనున్నారు. గోరక్ పూర్ ఘటనలతో తీవ్ర అప్రదిష్టపాలైన ముఖ్యమంత్రి యోగికి మరో అప్రదిష్ట కలిగింది. 

స్వచ్చా భారత్ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ వెనుకబడి ఉందని, ఆ రాష్ట్రంలో అన్ని పట్టణాలు ఆశుబ్రత తాండవిస్తోందని కేంద్రప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. మోడీ సర్కార్ భాజపా పాలిత రాష్ట్రానికి...అందునా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఏరికోరి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఆదిత్యానాథ్ యోగికి ఇవన్నీ తీరని అవమానాలు, అప్రదిష్టగా మారాయి. వెంటనే ‘స్వచ్ఛ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌-స్వస్థ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌’ అనే కార్యక్రమాన్ని యుద్దప్రాతిపదికన చేపట్టారు.

సరిగ్గా ఇదే సమయంలో రాహుల్ గాంధీ గోరక్ పూర్ బయలుదేరడంతో ముఖ్యమంత్రి యోగికి పుండు మీద కారం చల్లినట్లయింది. 

ఆయన రాహుల్ గాంధీ పర్యటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ గోరక్ పూర్ ఆసుపత్రేమీ పిక్నిక్ స్పాట్ కాదు అందరూ వచ్చి చూసిపోవడానికి. ఆసుపత్రిని పిక్నిక్ స్పాట్ గా మారుస్తామంటే అనుమతించబోము. డిల్లీలో కూర్చొనే యువరాజు రాహుల్ గాంధీ. ఆయనకు ఇక్కడి సమస్యలు, పరిస్థితులు ఏవీ తెలియవు. స్వచ్చా భారత్ ప్రాముఖ్యత అసలే తెలియదు,” అని అన్నారు. 

అంతటితో యోగి ఊరుకొంటే బాగానే ఉండేది కానీ గోరక్ పూర్ ఘటనలకు గత ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇంతకు ముందు రాష్ట్రాన్ని పాలించిన సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ ప్రభుత్వాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్తలని దాదాపు నిర్వీర్యం చేసేశాయి. గోరక్ పూర్ ఆసుపత్రిలో కల్పించాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. అందుకే ఇటువంటి విషాదకర ఘటనలు జరిగాయి,” అని ఆదిత్యనాథ్ యోగి ఆరోపించారు. 

అయితే ఆ రెండు ప్రభుత్వాల హయంలో గోరక్ పూర్ ఆసుపత్రిలో ఎన్నడూ ఇంతమంది చిన్నారులు చనిపోలేదు. అంటే ఆసుపత్రికి సంబంధించినంత వరకు అవి సరిగ్గానే వ్యవహరించినట్లు అర్ధం అవుతోంది. వాటి హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారిన మాట నిజమే. అందుకే ప్రజలు భాజపాకు పట్టం కట్టారు. యోగి అధికారం చేపట్టి అప్పుడే ఆరు నెలలవుతోంది. ఆయన ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ ఇంతవరకు పరిపాలన గాడిలో పెట్టలేకపోయారు. రాష్ట్రంలో పారిశుధ్యపరిస్థితి ఘోరంగా ఉండనే సంగతి కేంద్రం చెపితే తప్ప గుర్తించలేకపోయారు. తన అసమర్ధతను, వైఫల్యాలను గుర్తించి వాటిని సరిదిద్దుకొని, సమర్ధమైన పాలన సాగించగలిగితే ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేరు. ఆయన కూడా ఈవిధంగా ఎవరినీ వేలెత్తి చూపనక్కర లేదు కదా.  


Related Post