నితీష్ మళ్ళీ ఎన్డీయే గూటికి

August 19, 2017


img

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ 4 ఏళ్ళ తరువాత ఎన్డీయే గూటికి చేరుకొన్నారు. ఈరోజు పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరాలని పార్టీ తీర్మానించింది. తద్వారా నితీష్ కుమార్ వెంట ఉన్న ఎంపిలలో ఒకరిద్దరికి కేంద్రమత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. 

ఎప్పటికైనా ప్రధాన మంత్రి కావాలనేది నితీష్ కుమార్ కోరిక. కానీ 2013లో నరేంద్ర మోడీని భాజపా తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఎన్డీయేపై అలిగి బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఆయనతో లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపాయి. బిహార్ లో అధికారంలోకి వచ్చిన తరువాత లాలూ అండ్ సన్స్ ఆయనను ముప్పతిప్పలు పెడుతుండటంతో ఆయన మళ్ళీ క్రమంగా నరేంద్ర మోడీకు దగ్గరరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయేకు మద్దతు ప్రకటించడం ద్వారా ఇంకా దగ్గరయ్యారు. అదే సమయంలో లాలూ అండ్ సన్స్ పై సిబిఐ కేసులు నమోదు కావడంతో నితీష్ కుమార్-లాలూ వర్గాల మద్య విభేదాలు మొదలై చివరికి అవి తెగతెంపులకు దారి తీశాయి. ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేసి లాలూ అండ్ సన్స్ ను వదిలించుకొని భాజపా మద్దతుతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పూర్తిగా మోడీ అధీనంలోకి వచ్చేశారు. నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీయేలో కూడా చేరిపోవడానికి సిద్దపడ్డారు కనుక ఇక మోడీ కనుసన్నలలోనే మెలగవలసి ఉంటుంది. నితీష్ కుమార్ రాజకీయంగా ఇంకా బలంగా మారినప్పటికీ, ప్రధానమంత్రి కావాలనే ఆయన జీవితాశయం ఇక ఎన్నటికీ నెరవేరే అవకాశం లేదనే చెప్పవచ్చు.

అయితే భాజపా, కేంద్రం అండదండలతో నితీష్ కుమార్ ఇక కులాసాగా బిహార్ ను పరిపాలించుకోవచ్చు. అలాగే నితీష్ కుమార్ వంటి బలమైన నేతను ఎన్డీయే కూటమిలోకి రప్పించడం ద్వారా నరేంద్ర మోడీ ఇంకా బలవంతులయినట్లే చెప్పవచ్చు. 


Related Post