జయశంకర్ ఆనాడే చెప్పారు: కోదండరామ్

August 19, 2017


img

తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో ‘జయజశంకర్ సార్ స్ఫూర్తి- ఉద్యమ ఆకాంక్షలు-వాస్తవ పరిస్థితులు’ అనే అంశంపై ఒక సెమినార్ జరిగింది. దానిలో పాల్గొన్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్, దాని ఎమ్మెల్యేలపై చాలా కటువైన వ్యాఖ్యలు చేశారు. 

“దేశంలో మరే రాష్ట్రంలో జరుగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిపోతోందని తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు నిత్యం గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ ఈ మూడేళ్ళలో వారు ఏమి పీకారో..ఇక ముందు ఏమి పీకబోతున్నారో ఎవరికీ తెలియదు. కనుక ఈసారి ఎన్నికలలో తెరాస అభ్యర్ధులు ఓట్లు అడగటానికి మళ్ళీ మీకు ఓట్లేసి గెలిపిస్తే ఏమి పీకుతారని ప్రజలు గట్టిగా నిలదీయాలి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతోంది. ఎవరూ మాట్లాడానికి వీలులేదు..సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలులేదని తెరాస సర్కార్ భావిస్తున్నట్లుంది. భావస్వేచ్చకు ప్రభుత్వం సంకెళ్ళు వేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ఆ హక్కును కాలరాయడానికి తెరాస సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకోము. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాలని చెప్పిన స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోరాటాలు చేయవలసిరావచ్చని ఆనాడే నాతో అన్నారు. అదే నిజమైందిప్పుడు. ఆరోజు అయన సూచించిన విధంగానే ఇప్పుడు మేము పోరాడవలసివస్తోంది. అయన ఆశయాలు సాదించే వరకు మా పోరాటాలు కొనసాగుతుంటాయి,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 


Related Post