గోసంరక్షణ ఇలాగేనా చేసేది?

August 19, 2017


img

గోవులను కాపాడేబాధ్యత భుజానికి ఎత్తుకొన్న భాజపా అనుబంధ సంఘాలు గోరక్షక్ పేరిట చేస్తున్న దాడుల గురించి నిత్యం వార్తలలో వింటూనే ఉన్నాము. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత కానీ అవి తగ్గుముఖం పట్టలేదు. భాజపాపాలిత యూపి, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ గోసంరక్షణ హడావుడి మరికాస్త ఎక్కువగా కనబడుతోంది. అది గోవులపై నిజంగా ప్రేమతోనే అయితే బాగానే ఉండేది కానీ ఆ పేరుతో హిందువులను ఆకట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలే వికటిస్తున్నాయి. 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దుర్గ్ జిల్లాలో రాజ్ పూర్ అనే గ్రామంలో హరీష్ వర్మ అనే ఒక భాజపా నేత ఒక పెద్ద గోశాల నిర్వహిస్తున్నారు. దానిలో సుమారు 3-4 వందల వరకు ఆవులు ఉన్నట్లు సమాచారం. వాటిని ఆయన పట్టించుకోకపోవడం వలన, బయటకు విడిచిపెట్టకపోవడం వలన వాటిలో సుమారు 200 ఆవులు ఆకలి దప్పులతో అలమటించి చివరికి చనిపోయాయి. అక్కడ రోజూ పదుల సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయని, వాటిని గోశాల నిర్వాహకులు రహస్యంగా పూడ్చిపెడుతున్నారని స్థానికులు చెపుతున్నారు. గోశాలలో మిగిలిన ఆవుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నోరులేని ఆ మిగిలిన మూగజీవులను ఆయన చెర నుంచి విడిపించి సంరక్షిస్తే బాగుంటుంది.  ఆవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై దాడులు చేస్తున్న గోరక్షక్ లు, ఒక భాజపా నేత ఆవులను తిండి పెట్టకుండా మాడ్చి చంపుతుంటే ఎందుకు నిలదీయరు?    

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కేసులో అక్రమాలకు పాల్పడినప్పటికీ తన వద్ద ఉన్న పశువులను చంటి బిడ్డలకంటే ప్రేమగా సాకుతుంటారు. అలాగే యూపి సిఎం ఆదిత్యనాథ్ యోగి కూడా తన గోశాలలోని ఆవులను చాలా ప్రేమగా చూసుకొంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన వ్యవసాయ క్షేత్రంలో అనేక ఆవులను చాలా ప్రేమగా పెంచుతున్నారు. వీరందరూ కేవలం ఆవుల మీద నిజమైన ప్రేమతోనే పెంచుతున్నారు తప్ప వాటి పేరు చెప్పుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేయరు. వాటి పట్ల అటువంటి ప్రేమ, వాటిని పోషించే ఆర్ధికశక్తి ఉన్నప్పుడే వాటిని సాకడం మంచిది. కానీ నోరులేని ఆ జీవులను కూడా రాజకీయాలకు బలి చేయడం సరికాదు. వాటి పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా హేయమైన చర్య. 


Related Post