హోంమంత్రి వచ్చి ఏమి సాధిస్తారో?

August 18, 2017


img

సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో భాజపా తెలంగాణా విమోచనసభ నిర్వహించబోతోంది. ఆ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సహాయమంత్రి హంసరాజ్ ఆహీర్ కూడా హాజరుకాబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. అయితే కేంద్రమంత్రులను రప్పించడం ద్వారా భాజపా ఏమి సాధించాలనుకొంటోందో తెలియదు. ఎందుకంటే ఒకపక్క ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు తెరాస సర్కార్ పాలనను మెచ్చుకొంటున్నప్పుడు హోంమంత్రి దానిని విమర్శిస్తే ఆయనే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. 

కేంద్రమంత్రుల పర్యటనలు, సభలు భాజపా శ్రేణులకు ఉత్సాహం కలిగించడానికి పనికిరావచ్చు కానీ రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడానికి అది ఉపయోగపడకపోవచ్చు. రాష్ట్రంలో భాజపా బలీయమైన శక్తిగా ఎదగాలంటే ముందుగా అది సంస్థాగతంగా బలోపేతం కావలసి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే నిలబెట్టేందుకు భాజపా వద్ద తగినంత మంది సమర్ధులైన అభ్యర్ధులు కూడా లేరనేది బహిరంగ రహస్యమే. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఆయన పర్యటన తప్పకుండా భాజపాకు మేలు చేయవచ్చునేమో కానీ తెలంగాణా విమోచన దినోత్సవ సభకు కేంద్రమంత్రులు హాజరవడం వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.  


Related Post