తెలంగాణా భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, “2019 ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నాము. వాటిలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన కొంతమంది ప్రముఖ నేతలు భాజపాలో చేరబోతున్నారు. ఇక నుంచి వలసలు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయి. సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. దానికి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బాటు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, సహాయమంత్రి హంసరాజ్ ఆహీర్ తదితరులు కూడా హాజరుకాబోతున్నారు. ఆ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు భాజపాలో చేరే అవకాశం ఉంది. బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఐటిఐఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోనేందుకే కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తోంది. దానికి అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇంతవరకు అందించలేదు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వపరంగా చేయవలసిన పనులు పూర్తి చేయకుండా కేంద్రాన్ని నిందిస్తోంది. దేశంలో ఇతర రాష్ట్రాలు కేంద్రం నుంచి బారీగా నిధులు అందుకొంటుంటే తెలంగాణా మాత్రం వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలం అయ్యింది. కనుక తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయమైన భాజపా వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యం,” అని అన్నారు.
“ప్రస్తుతం భాజపాకు ఉన్న సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో గెలుచుకొనే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు సీట్లు తప్ప మొత్తం అన్ని సీట్లు తెరాసయే గెలుచుకొంటుంది,” అని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటిఆర్ పదేపదే చెపుతుంటే, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఆవిధంగా మాట్లాడటం సహజమే.
ఇక వలసల విషయానికి వస్తే, భాజపాలో ఇతర పార్టీల నేతలు చేరడానికి దాని ‘హిందుత్వ సిద్దాంతం’ పెద్ద అడ్డుగోడగా నిలుస్తోంది. దానితో సర్దుకుపోగలమని భావించినవారు లేదా వేరే మార్గం లేని పురందేశ్వరి, కావూరి, నాగం జనార్ధన్ రెడ్డి వంటివారు మాత్రమే భాజపాలో చేరుతుంటారు. ప్రస్తుతం తెలంగాణాలో కూడా అటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరలేని వారికి ఏకైక ప్రత్యామ్నాయంగా భాజపా మాత్రమే కనబడుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు, తెరాస ఎంపి డిశ్రీనివాస్ అండ్ సన్స్ భాజపావైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక లక్ష్మణ్ చెపుతునట్లుగా రానున్న రోజులలో ఇతర పార్టీల నుంచి భాజపాలోకి కొన్ని వలసలు ఉండవచ్చు.