దేశంలో రాజకీయ పార్టీలు ముస్లింలను ఎప్పుడూ ఓటర్లుగానే చూస్తుంటాయి తప్ప మనుషులుగా చూడలేవు. అసలు దేశప్రజలందరినీ కూడా అవి అదే దృష్టితో చూస్తూ అందుకు అనుగుణంగానే రాజకీయాలు చేస్తుంటాయి. ముస్లింలపై తమకే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పుకొంటూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి మజ్లీస్, తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. హజ్ కమిటీ సమావేశం సందర్భంగా మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం దానిపై పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి స్పందనలను అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడేళ్ళలో ముస్లింల కోసం అసలు ఏమి చేయలేదు. దాని గురించి ఎవరూ తనను ప్రశ్నించకుండా ముందు జాగ్రత్తగా ఆయన నిజాం నవాబుల గొప్పదనం గురించి మాట్లాడారు. తద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మభ్యపెట్టి ఇప్పుడు దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? దానిని ఎప్పటిలోగా అమలుచేస్తారో ఎందుకు చెప్పడం లేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సెక్యులర్ పార్టీ. అందుకే మా హయంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాము. ఒకవేళ కేసీఆర్ కు ముస్లింల పట్ల అంత ప్రేమే ఉన్నట్లయితే త్వరలో 84 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెపుతున్నారు కనుక వాటిలోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తన నిజాయితీని నిరూపించుకోవాలి. తెరాస కూడా ఆర్.ఎస్.ఎస్., భాజపాల దారిలోనే నడుస్తోంది. సంఘ్ పరివార్ తీసుకొన్న నిర్నయాలనే తెరాస సర్కార్ అమలుచేస్తోంది,” అని విమర్శలు గుప్పించారు.
మన రాజకీయ నాయకులు ముస్లింలను ఆకర్షించి వారి ఓట్లు రాల్చుకోవడానికి ముస్లిం టోపీలు ధరించి, వారితో కలిసి నమాజ్ చేస్తున్నట్లు నటిస్తుంటారు. అది వారిని, వారి మతాన్ని అవమానించడమేనని వారు ఎన్నడూ భావించరు. అదేవిధంగా దేశ ప్రజలందరినీ కులాలు, మతాలు, వర్గాలుగా విడదీసి ఒక్కో వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఒక్కో వేషం, ఒక్కో ఎత్తు వేస్తుంటారు. ఇటువంటి చవుకబారు ప్రయత్నాలను దేశ ప్రజలు నిరసించి, తిరస్కరించగలిగితే మన రాజకీయ నేతలలో కూడా మార్పు వస్తుంది. లేకుంటే ఈ వేషాలు, నాటకాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంటాయి.