భాజపాతో పొత్తులా...ఛాన్సే లేదు!

August 18, 2017


img

మహబూబ్ నగర్ తెరాస ఎంపి, లోక్ సభలో తెరాస నాయకుడు ఏపి జితేందర్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో భాజపాతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యం కానీ కేంద్రంలో ఎన్డీయేలో చేరే ఆలోచన కయీ మా పార్టీకి లేవు. ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణాకు సహాయసహకారాలు అందిస్తున్నంత కాలం దానికి అంశాల వారిగా బయట నుంచి మద్దతు ఇస్తుంటాము. ఒకవేళ ఏ విషయంలోనైనా అది తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లయితే నిర్మొహమాటంగా దానితో పోరాడుతాము. మొదటి నుంచి మేము ఇదే వైఖరితో ఉన్నాము. ఇకపై కూడా దానిని కొనసాగిస్తాము,” అని చెప్పారు. 

రాష్ట్రంలో భాజపా సవాళ్ళు, అధికారంలోకి రావడానికి అది చేస్తున్న ప్రయత్నాల గురించి విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కనుక భాజపాయే కాదు...రాష్ట్రంలో మరే పార్టీకి కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ మేమే విజయం సాధించి అధికారంలోకి రావడం తధ్యం,” అని చెప్పారు.

కేంద్రం పట్ల తెరాస సర్కార్ వైఖరి స్పష్టంగానే ఉన్నప్పటికీ, అది ఒకసారి కేంద్రానికి పూర్తి అనుకూలంగా మాట్లాడుతూ, మరొకసారి దానిపై నిప్పులు చెరుగుతుండటం వలన ప్రజలలో అయోమయం సృష్టిస్తోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో తెరాస-భాజపాల మద్య జరుగుతున్న రాజకీయ యుద్దాలు నిజమైనవేనా లేక ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నవా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమో కాదో వచ్చే ఎన్నికల నాటికి తెలియవచ్చు. 


Related Post