జయలలిత మృతిపై విచారణకు ఆదేశం

August 17, 2017


img

 రాజకీయ అవసరాలను బట్టి ప్రభుత్వాల ఆలోచనలు, నిర్ణయాలు మారుతుంటాయని చెప్పడానికి ఉదాహరణగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

అధికార అన్నాడిఎంకెలో పళనిస్వామి వర్గంతో చేతులు కలపడాని పన్నీరు సెల్వం వర్గం విధించిన షరతులలో ఇది కూడా ఒకటి. అలాగే ప్రస్తుతం శశికళ అధీనంలో ఉన్న చెన్నైలోని పోయెస్ గార్డెన్స్ (జయలలిత నివాసం) లోని వేదనిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. ఇప్పటికే శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్ ను పార్టీ నుంచి తప్పించారు. ఇక పన్నీరు సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇరువర్గాల విలీనం అయిపోతుంది. 

జయలలిత మృతిపై మొదట పన్నీరు సెల్వం కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఆ సమయంలో చాలా చురుకుగా పావులు కదుపుతున్న శశికళ ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడమే అందుకు కారణం అయ్యుండవచ్చు. తరువాత ఆయనను ఆ పదవి నుంచి తప్పించి ఆమె దానిని పొందాలని ప్రయత్నించినప్పుడు కూడా పన్నీరు సెల్వం ఏమాత్రం ప్రతిఘటించకుండా సగౌరవంగా పక్కకు తప్పుకొని ఆమెకు తన స్థానం అప్పగించడానికి సిద్దం అయ్యారు. 

కానీ హటాత్తుగా ఆమెపై తిరుగుబాటు చేసి జయలలిత మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని, దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఆరోపణలను శశికళ ఆమె అనుచరులు గట్టిగా ఖండించారు. ఆ సమయంలో పళనిస్వామి ఆమె వర్గంలోనే ఉన్నారు. ఆయన కూడా అప్పుడు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అప్పుడు జయలలితకు చికిత్స చేసిన చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం చేత తాము ఎటువంటి విచారణకైనా సిద్దం అని చెప్పించి శశికళ ఈ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ తరువాత ఊహించని విధంగా ఆమె జైలుకు వెళ్ళవలసిరావడంతో తనకు అత్యంత నమ్మకస్తుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు ఆయనే శశికళ రాజకీయ శత్రువు, ఆమె పతనానికి కారకుడైన పన్నీరు సెల్వంతో చేతులు కలపడానికి జయలలిత మృతిపై విచారణకు ఆదేశించారు. 

జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె చనిపోయేవరకు ఎవరినీ శశికళ కలవనీయకపోవడం వలననే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు జయ మృతిపై విచారణ జరిపించి దానికి శశికళే బాధ్యురాలు అని నివేదిక ఇస్తే ఇక శశికళ శాశ్వితంగా జైలులోనే ఉండవలసిరావచ్చు. అది పళని, పన్నీరు వర్గాల మిత్రత్వానికి, వారి రాజకీయ సుస్థిరతకు బలమైన పునాదిగా మారుతుంది. తెర వెనుక ఉంటూనే వారిరువురినీ కలిపి, వారికి యధాశాక్తిన సహాయసహకారాలు అందిస్తూ ఈ స్థిరత్వం కల్పించినందుకు కృతజ్ఞతగా వారు భాజపాకు రాష్ట్రంలో కాలుమోపేందుకు అవకాశం కల్పించడం సహజమే. 

ఒకసారి సరైనదనుకొన్నదే పరిస్థితులు మారగానే తప్పుగా ఏవిధంగా మారుతుందో అర్ధం చేసుకోవడానికి ఈ పరిణామాలన్నీ చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.     



Related Post