భారత్-చైనా మద్య సిక్కిం సరిహద్దులో డొక్లాం వద్ద గత రెండున్నర నెలలుగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. దానిపై చైనా ప్రభుత్వం, దాని అధికార మీడియా కూడా భారత్ కు తీవ్రమైన హెచ్చరికలు చేస్తోంది. అయినా భారత్ వెనక్కు తగ్గకపోవడంతో చైనా ఇప్పుడు సంకటస్థితిలో చిక్కుకొంది. ముందుకు సాగితే భారత్ తో యుద్ధం చేయవలసివస్తుంది. వెనక్కు తగ్గితే ప్రపంచదేశాలలో నవ్వులపాలవుతుంది. కనుక ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంది.
ఈ నేపధ్యంలో చైనాపై ఇంకా ఒత్తిడి పెంచడానికి వాటి ఉత్పత్తులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును పెంచడానికి సిద్దం అవుతోంది. దానిని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశమూ కూడా బలమైన కారణం లేకుండా మరో దేశ ఉత్పత్తులను నిషేధించకూడదు. కనుక చైనా ఉత్పత్తులను భారత్ సర్కార్ అధికారికంగా నిషేదించలేదు. అందుకే కేంద్రం మరో మార్గం ఎంచుకొన్నట్లు కనిపిస్తోంది. భారత్ ను ముంచెత్తుతున్న చైనా మొబైల్ ఫోన్స్ లో భారతీయుల వ్యక్తిగత సమాచారం భద్రతపై అనుమానాలు లేవనెత్తింది. చైనా మొబైల్ ఫోన్స్ ద్వారా కోట్లాది భారతీయుల వ్యక్తిగత సమాచారం దొంగతనం అవుతున్నట్లు అనుమానాలున్నాయని కనుక తమ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై ఈనెల 28 లోగా వివరణ ఈయవలసిందిగా కోరుతూ కేంద్ర ఐటి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ చైనా మొబైల్ దిగ్గజాలకు నోటీసులు పంపించింది. వాటిలో రెడ్-మి, ఒప్పో, షియోమి, జియోని మొదలైన 21 మొబైల్ ఫోన్ కంపెనీలతో బాటు ఆపిల్, సామ్ సంగ్, దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ కూడా ఉన్నాయి.
సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ లో ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నా మన వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని అవి కోరుతుంటాయి. గూగుల్ ప్లే స్టోర్ పై నమ్మకంతో చాలామంది తమ కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజులు మొదలైన సమాచారం అంతా పరిశీలించడానికి అనుమతి ఇచ్చేస్తుంటారు. కనుక స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నవారి సమాచారం దేశం దాటిపోతోందని స్పష్టం అవుతోంది.
ఈ సాకుతో చైనా మొబైల్ కంపెనీలను భారత్ లో నిషేధించడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ అదే జరిగితే భారత్ నె నమ్ముకొన్న చైనా మొబైల్ సంస్థలు దారుణంగా నష్టపోతాయి. కనుక ఆ భయంతో అవి తమ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఖాయం. వాటి ఒత్తిడికి లొంగితే డొక్లాం నుంచి తోక ముడిచి వెనక్కు వెళ్ళకతప్పదు. బహుశః ఇదే కేంద్రప్రభుత్వం వ్యూహం అయ్యుండవచ్చు. భారత్ మార్కెట్లపై చైనా సంస్థలు ఆధారపడటమే ఇప్పుడు దాని బలహీనతగా మారినట్లు కనిపిస్తోంది.
ఏమైనప్పటికీ భారతీయులు అందరూ చైనా ఉత్పత్తులను కొనడం మానుకొని స్వదేశీ సంస్థలు తయారుచేస్తున్న ఉత్పత్తులనే కొనడం ద్వారా మన దేశానికి, మన పరిశ్రమలకు మనం సహాయపడినట్లు అవుతుంది. తద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. అప్పుడు భారత్ డబ్బు భారత్ లోనే ఉంటుంది కనుక దేశ ఆర్ధికపరిస్థితి కూడా బలంగా మారుతుంది.